Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22వ జీఓ అమలు చేయాలని గెజిట్ చేయాలి
- సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట జరిగిన 10వ రోజు సమ్మెలో..
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, జీఓ నెంబర్ 22 అమలు చేయాలని, సింగరేణి లాభాల్లో వాటా పంచాలని, లేని పక్షంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిపి వేస్తామనీ, జైలు భరోకైనా కాంట్రాక్టు కార్మికులు సిద్ధమవుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం స్పష్టంచేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 10 రోజుకు చేరింది. ఈ సందర్భంగా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జరిగిన సమ్మె సభలో వారు మాట్లాడారు. సింగరేణిలో చట్టపరంగా కార్మికులకు చెందే హక్కులను అమలు చేయడంతో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సింగరేణి చైర్మెన్ ఎనిమిదేండ్లుగా అ పదవిలో పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని సూచించారు. కేసీఆర్ చెప్పే మాటలను ఇంతకాలం నమ్మి రెండు సార్లు ఓట్లు వేసి గెలిపించామని తెలిపారు. అయినా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈనెల 22 జరిగే చర్చలు విఫలం అయితే తరువాత జరిగి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, సింగరేణి వ్యాప్తంగా పర్మినెంట్ కార్మికులను కలుపుకుని సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బొగ్గు ఉత్పతిని నిలిపివేస్తామనీ, ఓసీ, ఓబి క్వారీల్లోకి చేరి అడ్డుకుంటామన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ కార్మికులకు అండగా ఉంటామని, ముందు భాగాన నిలబడి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్, అధ్యక్షులు ఎంవి.అప్పారావు, ఏఐటీయూసీ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు తోట దేవి ప్రసన్న, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు జే.బాలశౌరి, తదితరులు పాల్గొని మద్దతు తెలియజేశారు.