Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదులను తరిమికొట్టేది కమ్యూనిస్టులే : సీపీఐ బహిరంగ సభలో చాడ, కూనంనేని
- ఘనంగా సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభ
నవతెలంగా-కాశిబుగ్గ
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని ఆజంజాహి మిల్ గ్రౌండ్లో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మేకల రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు, వెట్టి చాకిరికి, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని గుర్తుచేశారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దుం మోయినోద్దీన్ పిలుపుతో బాంచెన్ దొర అన్న ప్రజలే బందూకులు పట్టి నిజాంను తరిమి కొట్టారని తెలిపారు. కానీ ఆనాడు పోరాటంలో ఎక్కడా లేని బీజేపీ సర్దార్ వల్లభారు పటేల్తోనే నిజాం ప్రభుత్వం అంతమైందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం చరిత్రను వక్రీకరించే ప్రయత్నమేనని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వరంగల్ విప్లవ పోరాటాల గడ్డ అని, ఈ గడ్డపై ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం విజయవంతమై, నైజాం పాలనకు చరమగీతం పాడిందన్నారు. అదే పోరాట స్ఫూర్తితో జరుగుతున్న పేదల భూ పోరాటాలు విజయవంతమై తీరుతాయని తెలిపారు. బండెనక బండి కట్టి నిజాం సర్కారును తరిమినట్టే.. కేంద్రంలోని బీజేపీ మతోన్మాదులను వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలిసి తరిమికొడతామని స్పష్టంచేశారు. వరంగల్లో పేదలు వేసుకున్న గుడిసెల జోలికి వస్తే ఖబడ్దార్ అని గూండాలను, రౌడీలు, భూ కబ్జాదారులను హెచ్చరించారు. వరంగల్ కమ్యూనిస్టుల అడ్డా అని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్వ వైభవం తీసుకుని వచ్చేలా ఊరూరా ఎర్ర జెండా ఎగురవేస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తామని అన్నారు.
సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు, పంజాల రమేష్, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, సిహెచ్ రాజారెడ్డి, బి.విజయసారధి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.