Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగ నియామకాల్లో గిరిజనలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ఎం.ధర్మ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన 'పది శాతం గిరిజన రిజర్వేషన్ జీవో అమలుకోసం సమాలోచన సమావేశం' తీర్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ ఎలాంటి చిక్కులు తలెత్తకుండా రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధిగా జోక్యం చేసుకుని ఆర్టికల్ 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేరుస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని కోరారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో సీఎం ప్రకటించిన రిజర్వేషన్లను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వి.దాస్‌రాంనాయక్,రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ నాయక్,నరేందర్ పవార్, గిరిజన మేధావుల పోరాట అధ్యక్షులు ప్రొఫె˜సర్ ధనుంజరు నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి సోమ్లాలాల్ నాయక్, అసోసియేట్ ప్రెసిడెంట్ టి.మోహన్ సింగ్, గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ చౌహాన్ రాష్ట్ర అధ్యక్షులు కొర్రా శరత్. ఉస్మానియా గిరిజన జేఏసీి నాయకులు రవీందర్ నాయక్, సురేష్ నాయక్, ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రఘు ఎరుకల, గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం బాలు నాయక్, నాయకులు కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన రిజర్వేషన్ బిల్లుపెట్టి కేంద్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకాన్ని త్వరలో అమలుచేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదేండ్లుగా కమ్యూనిస్టు పార్టీలు, గిరిజన సంఘాల పోరాట ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. రిజర్వేషన్లతోపాటుగా పోడు భూముల సమస్యనూ తక్షణమే పరిష్కరించి సాగుదార్లకు హక్కుపత్రాలివ్వాలని కోరారు. ఇదే క్రమంలో పది శాతం గిరిజన రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రకటనకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే జీవో విడుదల చేసి అన్ని విద్యా, ఉద్యోగ నియామకాల్లో దాన్ని వర్తింపజేయాలని తెలిపారు. అవసరమైతే సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించకుండా సుదీర్ఘకాలంగా పెండింగులో పెట్టడం ద్వారా గిరిజనుల పట్ల ఉద్ధేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు.
ఎస్సీలకు రిజర్వేషన్ల శాతం పెంచాలి
రాష్ట్రంలో ఎస్సీల రిజర్వేషన్ శాతం పెంచాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌కి ఆయన వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఇదే విధంగా ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, అందులో మాదిగలకు రిజర్వేషన్లను 12 శాతం తమకి పెంచా లని విజ్ఞప్తి చేశారు.
- డాక్టర్ పిడమర్తి రవి