Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతల ఆక్రందన
- ప్రజావాణిలో భూ బాధితుల ఆవేదన
- సూర్యాపేటలో ఇద్దరు, గద్వాలలో రైతు ఆత్మహత్యాయత్నం
- అడ్డుకున్న కార్యాలయ సిబ్బంది
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్/ధరూర్
పోలీసుల దగ్గరకు వెళ్లితే పట్టించుకోరు.. అధికారుల వద్దకొస్తే తమకు సంబంధం లేదంటారు.. మాకు దిక్కెవరు అంటూ
భూసమస్యల బాధితులు సోమవారం కలెక్టరేట్లలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఇద్దరు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా.. సిబ్బంది అడ్డుకున్నారు. గద్వాల కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గరిడేపల్లి మండలం కల్మలచెర్వు గ్రామానికి చెందిన మీసాల అన్నపూర్ణ కూతురు స్వాతితో కలిసి తమ భూ సమస్యపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. తన భర్త మీసాల జానయ్య పేరున గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 308/2లో ఉన్న 5 గుంటల భూమిని బెజ్జం వెంకన్న ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టు నుంచి ప్రొటక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు. కానీ పోలీసులు రక్షణ కల్పించకపోగా ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ తమ కుటుంబ సభ్యులపైనే అక్రమ కేసులు బనాయించారని అన్నపూర్ణ వాపోయింది. దాంతోపాటు గ్రామ సర్వే నెంబర్ 331/1, 334లో మీసాల స్వాతి పేరున ఉన్న 25 గుంటల భూమి, 331/2/2, 332/2/2, 330/2లో మీసాల అన్నపూర్ణ పేరున ఉన్న 34 గుంటల భూమిని మీసాల సైదులు కబ్జా చేశారనీ, ఈ భూమిపై ఉన్న కోర్టు ఆర్డర్ అమలు చేయడంలో రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన చెందారు. ఇదే గ్రామానికి చెందిన పున్న వీరమ్మ కుమారుడు పున్న సైదులుతో కలిసి ప్రజావాణికి వచ్చారు. గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 870/27లో గల 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమిని ఉందని, బెజ్జం పిచ్చయ్య, బెజ్జం దాసు, శెట్టిపల్లి కృష్ణ, శెట్టిపల్లి రాముడు తమ భూమిపైకి వస్తూ సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. భూ బాధితులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో.. ఈ విషయాలు పోలీసులు చూడాల్సినవి అని, తమకు సంబంధం లేదని, ఎస్పీని కలవండని అదనపు కలెక్టర్ వారితో చెప్పారు. దాంతో పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవడం లేదని కలెక్టరేట్‌కు వస్తే.. వీళ్లేమో తమకు సంబంధం లేదంటున్నారని మీసాల స్వాతి పెట్రోల్ పోసుకున్నది. పున్న సైదులు కూడా పెట్రోల్ పోసుకునే యత్నం చేయగా కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సంఘటనతో సమావేశ మందిరంలో గందరగోళం ఏర్పడింది. చివ్వెంల పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి కోదాడ డీఎస్పీ వద్దకు పంపారు.
నా భూమిని తిరిగి ఇప్పించండి
గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల కలెక్టర్ కార్యాలయం ఆఫీస్ ముందు రైతు పెట్రోల్ పోసుకున్నారు. మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు లోకేష్‌కు గ్రామ శివారులో ఐదెకరాల 20 గుంటల భూమి ఉంది. అయితే, అతని భూమి రికార్డుల్లో ఇతరుల పేరున ఎక్కింది. దాంతో అతను కలెక్టర్‌కు ఎనిమిదిసార్లు ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. సోమవారం ప్రజావాణికి వచ్చిన రైతు 'నా భూమిని నాకు తిరిగి ఇవ్వండి..' అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకున్నాడు.