Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు ఉద్యోగుల వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
- సుప్రీం, రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపక సంఘాల ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు/అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపక సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఈ మేరకు జీవో నెంబర్ 16 కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వెట్టిచాకిరిలో కొనసాగుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు/ అధ్యాపకులను క్రమబద్ధీ కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 16ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ జీవో అమలును ఆపాలంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన కనికే శ్రీశైల మల్లికార్జున్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి ఆ పిటిషన్‌ను కొట్టేసిందని పేర్కొన్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాప కులకు న్యాయం చేసిందని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనతోపాటు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న తదితరులు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిశామని వివరించారు. కోర్టు విషయాలు, క్రమబద్ధీకరణకు సంబంధించిన సమస్యలపై చర్చించామని తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులను త్వరగా క్రమబద్దీకరణ చేసేందుకు కృషి చేయాలని కోరామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు లో ఈ కేసును గెలిచేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు టి హరీశ్‌రావు, కేటీఆర్, పి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు : టిప్స్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైందని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త ఎం. జంగయ్య తెలిపారు. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టేసేందుకు సహకరిం చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రకటించారు.
సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ఆర్జేడీసీఎల్ఏ
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటర్ కమిషనరేట్ లో సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డేజీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కుమార్, నాయకులు చంద్రశేఖర్, పరుశురాం, గుండు ఆంజనేయులు, తిరుపతి, రామ్మోహన్, అనిల్‌రెడ్డి, చంద్రమౌళి, సదాశివ, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.