Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణిలో సమ్మె నివారణకు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్‌కు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఏడు నెలలుగా చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచలేమని యాజమాన్యం చేతులెత్తేయడం తగదని హెచ్చరించారు. కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యం కనీసం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కోలిండియాలో కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న వేతనాలను సింగరేణి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎక్స్‌గ్రేషియా, క్యాంటీన్ సౌకర్యం, సెలవులు, రక్షణ పరికరాల అందజేత, తదితర చట్టబద్ధ సౌకర్యాలేవీ కాంట్రాక్టు కార్మికులకు దక్కట్లేదని వాపోయారు. సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పోలీసులతో అరెస్టు చేయించడం, కాంట్రాక్టర్లతో బెదిరించడం తగదని హెచ్చరించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గెజిట్ విడుదల కానందునే జీవో 22 ప్రకారం వేతనాలు ఇవ్వలేకపోతున్నామని డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.