Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఆర్సీకి వ్యకాస విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళితులకు మూడెకరాల పథకం కింద సీలింగ్ భూమికి పట్టాలివ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) కోరింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్‌కు సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ నేతృత్వంలో పలువురు నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని ఇచ్చుల్లపల్లిలో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూమిని అనుభవంలో ఉన్న దళితులకు అసైన్మెంట్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇచ్చిన నివేదిక ప్రకారం సర్వే నెంబర్ 69లో 16.9 ఎకరాలు సర్వే నెంబర్ 73లో 16.10 ఎకరాలు సర్వేనెంబర్ 75లో సీలింగ్ భూమి ఉందని వివరించారు. అంతే తప్ప సీలింగ్ భూమి ఎన్ని ఎకరాలు ఉందనేది స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. ఈ భూమిలో మొత్తం రాళ్లు, గుట్టలు ఉన్నాయనేది వాస్తవ సమాచారం కాదనీ, తక్షణమే ప్రభుత్వ సీలింగ్ భూమిని దళితుల మూడెకరాల పథకం కింద అనుభవంలో ఉన్న 65 దళిత కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. తరతరాలుగా అదే భూమిపైన ఇచ్చుల్లపల్లి గ్రామ దళితులు పంటను పండిస్తున్నారని, ఆ భూములే వారికి జీవనాధారంగా ఉన్నాయనేది వాస్తవమని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములపైన అసైన్మెంట్ పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ పేదలకు అందించేలా తగు చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, హన్మకొండ జిల్లా నాయకులు వేల్పుల రవి, మహంకాళి సమ్మక్క, మిడిదొడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.