Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిఫ్ట్ ఇచ్చినందుకు నిండు ప్రాణం బలి
నవతెలంగాణ-ముదిగొండ
కూతురుని చూసొద్దామని బైక్‌పై బయలుదేరిన ఓ వ్యక్తిని మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తి.. అతన్ని లిఫ్ట్ అడిగి.. సూది మందుతో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామ సమీపాన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (45) ఏపీలోని కృష్ణా జిల్లా గండ్రాయి గ్రామంలో ఉంటున్న తన కూతురు ఇంటికి ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం బయలుదేరాడు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామం దాటిన తర్వాత మార్గమధ్యలో గుర్తుతెలియని ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడగటంతో ఎక్కించుకున్నాడు. కాగా, ఆ వ్యక్తి సూది మందుతో జమాల్ సాహెబ్‌ను ఒక్కసారిగా గుచ్చడంతో గమనించి బైక్‌ను ఆపాడు. దాంతో దుండగుడు సిరంజిని అక్కడ పడవేసి పరారయ్యాడు. విషయాన్ని భార్యకు ఫోన్ ద్వారా తెలిపిన జమాల్.. అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి సమీపంలో ఉన్న వల్లభి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ తోట నాగరాజు సందర్శించి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా సూది మందుతో హత్య చేయటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికులు, గ్రామ ప్రజలు, వాహనదారులు, భయభ్రాంతులకు గురయ్యారు. జమాల్ సాహెబ్ మృతి చెందడంతో బొప్పారం గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.