Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
దశాబ్దాలుగా పేరుకుపోయిన తమ భూ సమస్య పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా పసరమడ్ల గ్రామానికి చెందిన రైతు నిమ్మల నరసింహా రావు సోమవారం జనగామ కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం కావడంతో జిల్లా అధికారులు, పోలీసులతో పాటు విజ్ఞప్తులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలంతా అక్కడే ఉండటంతో ఈ విషయం క్షణాల్లో సంచలనం రేపింది. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ.. ఏండ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా భూ సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కుటుంబపోషణ నిమిత్తం ఉపాధి కోసం తాడ్వాయికి వలస వెళ్ళిన సమయంలో గ్రామంలో తమకున్న భూమిని అప్పటి తహసీల్దార్,, వీఆర్ఓ కలిసి ఇతరులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నో సార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పరిష్కరించలేదని వాపోయారు. కాగా, బాధిత రైతు మనస్తాపంతో కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయ త్నించాడు. అక్కడున్న వారు గమనించి రైతుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆర్డీవో మధుమోహన్ రైతుకు నచ్చజెప్పి కిందికి రావాలని కోరాడు. సమస్య పరిష్కారం అయిన తర్వాతనే తాను భోజనానికి వెళ్తానని హామీ ఇవ్వడంతో రైతు కిందికి దిగాడు. అనంతరం రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై జనగామ తహసీల్దార్ రవీందర్‌ను వివరణ కోరగా నరసింహారావు భూమి సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి చేశానని, ఏడాది కిందటే ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని చెప్పారు.