Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొంతుకోసి పరారైన నిందితుడు
టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కోఆర్దినేటర్ విజయ్ సింహపై కేసు
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ పంజాగుట్టలో వివాహితపై హత్యాయత్నం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నిందితుడు మహిళ గొంతుకోసి పరారయ్యాడు. బాధితురాలు ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ సింహగా ప్రచారం జరిగింది.
ఎమ్మెల్యే పీఏ కాబట్టి పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్పందించారు. విజయ్ తన పీఏ కాదని, గతంలో ఓ కార్పొరేటర్ వద్ద పని చేశాడని మీడియాకు వెల్లడించారు.
అరెస్టు చేయాలని కాంగ్రెస్, బీజేపీ ఆందోళన
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు తీసుకొని కూడా మహిళపై దాడిచేసిన టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ విజయ్ సింహను అరెస్టు చేయాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. టీఆర్ఎస్ నేతల అనుచరుల అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయన్నారు. కాగా, బాధితురాలి వాంగ్మూలం ప్రకారం విజరు సింహాపై 448, 324, 354(ఎ) 506 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఘటనతో తనకు సంబంధం లేదు : విజయ్
అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఒక మహిళపై గొంతు కోసినట్టు తనపై తప్పుడు కేసు బనాయించారని, ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బోరబండ టీఆర్ఎస్ కోఆర్డినేటర్ విజయసింహా తెలిపారు. సోమవారం ఆయన బోరబండ బస్టాండ్ సెంటర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్షలతోనే బోరబండ ప్రస్తుత కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫిసియుద్దీన్ తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏను కాదన్నాడు.