Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు అస్త్రంగా చిత్రాలు
- ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేసేలా ఎత్తుగడ
- అందుకే అమిత్‌షా ప్రాంతీయ హీరోల్ని కలుస్తున్నడు
- ప్రస్తుత సమాజానికి తాతాజీ అవసరం
- తాపీ ధర్మారావు రచనల్ని సంకలనంగా తేవాలి
- వెబినార్‌లో సినీ జర్నలిస్టు, విమర్శకులు రంగా వజ్జుల భరద్వాజ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'జాతీయ వాదాన్ని ప్రమోట్ చేయడంలో సినిమా రంగం బిజీగా ఉంది. సమస్యలతో సతమతమవుతున్న ప్రజల ఆలోచనల్ని తప్పుదోవ పట్టించి తమవైపు తిప్పుకునే పనిలో హిందూత్వ శక్తులున్నాయి. ఈ క్రమంలోనే సినిమాను బీజేపీ వాడుకుంటున్నది. ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ అల్లూరి సీతారామరాజు, కొమ్రంభీమ్ పాత్రలకు రాముడు, ఆంజనేయుడిని ఆపాదించారు. దీనిని బట్టే హిందూత్వ భావాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఎంతగా జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఆ కోవలోనే 15 సినిమాల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. రజాకర్ల ఫైల్స్ కూడా అందులో భాగమే. ప్రాంతీయ భాషల్లో తీవ్ర ప్రభావం చూపే హీరోల్ని బీజేపీ అగ్రనేత అమిత్‌షా అందుకే కలుస్తున్నడు. ఈ నేపథ్యంలోనే ప్రతి పీడిత తరగతిని పట్టుకుని మూలాల్లోకి వెళ్లి చరిత్ర ఆధారాలను వెలికి తీసి అన్యాయాలను సమాజం, ప్రజల కండ్ల ముందు పెట్టిన తాపీ ధర్మారావు ప్రస్తుత సమాజానికి అవసరం. ఆయన రచనల్ని సంకలనంగా తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉంది' అని ప్రముఖ సినీ జర్నలిస్టు, విమర్శకులు, వ్యవసాయ శాస్త్రవేత్త రంగావజ్జుల భరద్వాజ అన్నారు. తాపీ ధర్మారావు 135వ జయంతి సందర్భంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'పాత్రికేయుడు, పరిశోధకుడు, సినీ రచయిత తాతాజీ జీవితం- విశిష్టత' అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. దీనికి ఎస్వీకే మేనేజింగ్ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ..ప్రజా ప్రయోజనాలే గీటురాయిగా తాపీ ధర్మారావు రచనలుండేవని కొనియాడారు. సమాజలోతుల్లోకెెళ్లి నిత్యం పరిశోధనలు చేస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పడంలో భాగంగా దేవాలయాలపై బూతుబొమ్మలెందు?, పెండ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇనుపకచ్చడాలు, ఆంధ్రులకొక మనవి తదితర రచనలు తాతాజీ కలం నుంచి జాలువారాయని ప్రస్తావించారు. తన కొత్త రచనలతో తెలుగునాట నూతన ఒరవడిని ఆయన సృష్టించారని ప్రశంసించారు. కులం పుట్టుక, అణచివేత, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఎలా ముందుకు సాగుతున్నది? ఎటువైపు వెళ్లబోతున్నదనే దాన్ని ఆయన ఆనాడే వివరించారన్నారు. మహిళల అణచివేతను ఎత్తిచూపుతూ రచనలు చేశాడన్నారు. సమాజ హితం కోసం పనిచేసిన ఆయన్ను సినిమారంగం పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు. తెలుగు సినిమా రంగంలో అణగారిన ప్రజలు, దళితుల మీద వచ్చిన సినిమాలు తక్కువ అనీ, వచ్చిన అరకొర కూడా బ్రహ్మణ ఆధిపత్యానికి లోబడే వచ్చాయని తెలిపారు. ద్రావిడ ఉద్యమ ప్రభావం ఉన్న తమిళ సినిమాల్లో వెనుకబడిన తరగతుల గురించి చాలా బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయని వివరించారు. తెలుగులో అందుకు భిన్నంగా లాభాల కోసం కమర్షియల్ సినిమాలు వస్తున్నాయని విమర్శించారు. మతం పేరుతో సమాజాన్ని ఏకీకృతం చేసి ఫాసిస్టు పాలనే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తున్నదన్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిన్నటి గురించి తెలియనివాడు రేపటిని అర్థంచేసుకోలేడనీ, రేపటి గురించి అర్థం చేసుకోలేనివాడు భవిష్యత్‌ను నిర్మించలేడని తాపీ ధర్మారావు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో యువతలో అధ్యయనం పెరగాల్సిన అవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. సమాజానికి తాపీధర్మారావు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.