Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐబీఇఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు
- హైదరాబాద్లో సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకుల యాజమాన్యాలు అక్రమ బదిలీలు చేస్తూ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఇఏ) జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఒప్పందాలకు విరుద్దంగా సెంట్రల్ బ్యాంకులో చేసిన ఉద్యోగుల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలనీ, బదిలీల విషయంలో ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని అయన డిమాండ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా ఉద్యోగులపై వేధింపులు, అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్సిబియూ) చేపట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీబీఐఇఏ) ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సందర్భంగా కోఠి బ్యాంక్ స్ట్రీట్ సెంట్రల్ బ్యాంక్ జోనల్ కార్యాలయం ముందు ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.రాంబాబు తోపాటు అసోసియేషన్ తెలంగాణ, ఏపీ ప్రధాన కార్యదర్శి పి.ఉదరు, రీజినల్ కార్యదర్శి ఎస్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఉద్యోగులు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ యాజమాన్యం ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ ప్రయివేటీకరణ విధానాలను నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రదర్శననుద్దేశించి రాంబాబు ప్రసంగిస్తూ సెంట్రల్ బ్యాంక్ యాజమాన్యం చట్టాలను, కార్మిక శాఖ కమిషనర్ల ఉత్తర్వులను, ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించకుండా అక్రమంగా దేశవ్యాప్తంగా 4600 మంది ఉద్యోగులను బదిలీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులను, మహిళలను, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులను బ్యాంక్ యాజమాన్యం సుదూర ప్రాంతాలకు ఇష్టారీతిన బదిలీలు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బదిలీలపై గత మే నెల 24వ తేదీన ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపి యాజమాన్యంతో చేసుకున్న పరిష్కార ఒప్పందాన్ని అమలు చేయాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినా, బదిలీలలను నిలుపుదల చేస్తూ ఉద్యోగుల యధాతధస్థి తిని కొనసాగించాలని కార్మికశాఖ కమిషనర్లు ఉత్తర్వులు జారీచేసినా సెంట్రల్ బ్యాంక్ యాజమాన్యం పట్టించు కోవడంలేదని ఆయన విమర్శించారు. వేతన సవరణ ఒప్పందం ప్రకారం రోటేషనల్ ట్రాన్స్ ఫర్లు చేయొద్దనీ, అలాగే 100 కిలోమీటర్ల లోపు డిప్లొయిమెంట్ బదిలీలు చేయవచ్చునని కేరళ రాష్ట్ర హై కోర్టు కూడా తీర్పు చెప్పిందనీ, ఈ తీర్పును కూడా తుంగలో తోక్కి ఉద్యోగులను అక్రమంగా బదిలీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులపై వేధింపులను విరమించుకుని అక్రమ బదిలీలను రద్దు చేయనట్లయితే మొత్తం బ్యాంకింగ్ రంగంలో పోరాటాన్ని చేపట్టవలసి వస్తుందని యాజమాన్యాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని రాంబాబు హెచ్చరించారు.