Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వివాదం
నవతెలంగాణ-కొత్తగూడ
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు చేసుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తుండగా అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా పనులు నిలిపివేయించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలో బతుకమ్మ వేడుకలు చేసుకునే ప్రాంగణంలో గ్రామస్థులు బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుండగా అటవీశాఖ సెక్షన్ అధికారి మక్బూల్, స్థానిక బిట్ అధికారి పుష్పలత అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. చెరువు కట్ట ఫారెస్ట్ కంపార్ట్మెంట్లో ఉందని, ఇక్కడ బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ అక్కడ పని చేస్తున్న తాపీ మెస్త్రీల పనిముట్లను లాక్కొని నానా హంగామా చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని సెక్షన్ ఆఫీసర్‌ను వేడుకున్నారు. ఇది కాకతీయుల కాలం నాటి చెరువు అని, మీ పరిధి కాదనుకొని పనులు చేసుకున్నామని, దయచేసి సహకరించండి అంటూ అధికారుల కాళ్ల మీద పడినా కనికరించలేదు. పైగా కేసులు నమోదు చేస్తామని భయబ్రాంతులకు గురి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. దాంతో గ్రామస్తులు అటవీ అధికారి మధ్య వాగ్వివాదం జరిగింది. కాగా విషయం తెలుసుకున్న పాత్రికేయులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో సదరు ఫారెస్ట్ అధికారులు అక్కడి నుండి జారుకున్నారు. గ్రామస్తులను దూషించిన సెక్షన్ ఆఫీసర్‌పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకొని బతుకమ్మ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.