Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం, భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు పంచేలా పోరాటాలను ఉధృతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వ జీవో 140 కాలయాపన కమిటీలుగా కాకుండా పట్టాలు మంజూరు చేసే కమిటీలుగా మార్చాలని కోరారు. ఆ భూమి అభివృద్ధి కింద నిధులు మంజూరు చేయాలన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలనీ, అదే విధంగా స్థలం ఉన్న వారికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇంటి స్థలం, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర స్థానిక సమస్యలపై ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాలకు వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్ధతిస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం మోపుతున్న భారాలను వ్యతిరేకంగా పేదల పక్షాన వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, ఎం.రాములు, ఎం.ఆంజనేయులు, బి.ప్రసాద్, బి.పద్మ, బి.సారంగపాణి, వి.పద్మ, ఆర్.శశిథర్, కె.జగన్, అల్వాల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.