Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మత్స్యకారుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023-24 బడ్జెట్లో రూ.5వేల కోట్ల నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర స్థాయి విస్త్రుత సమావేశం డిమాండ్ చేసింది. సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సమావేశం జరిగినట్టు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు డిమాండ్లతో ఆమోదించిన తీర్మానాలను వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మూడేండ్లు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులను ఆదుకోవడానికి సొసైటీలకు రూ.10 లక్షల ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సొసైటీల ద్వారా జలవనరులకు సరిపడేంత ఉచిత చేప, రొయ్య పిల్లల్ని పంపిణీ చేయాలని తీర్మానించారు. శిధిలావస్థలో ఉండి కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ చేప పిల్లల విత్తన క్షేత్రాల నిర్మాణాలకు రూ.500 కోట్ల నిధులు కేటాయించి, సిబ్బందిని నియమించాలనీ, కనీసం జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా, శాటిలైట్ సర్వే చేసి ఫెన్సింగ్ వేయాలనీ, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలనీ, సహజ మరణం పొందిన మత్సకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలనీ, తక్షణ సాయంగా రూ.50వేలు ఇవ్వాలనీ, కుటుంబంలో ఒకరికి ఎలాంటి షరతులు లేకుండా సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలంటూ పలు తీర్మానాలను ఆమోదించారు.