Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనుమతుల్లేకుండా నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని పీవైఎల్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనను సోమవారం పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ప్రదీప్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌లో ఎలాంటి అనుమతుల్లేకుండా కనీస నిబంధనలు పాటించకుండా కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయని విమర్శించారు. జీవోనెంబర్ 200 ప్రకారం డీఈవో అనుమతి ఉండాలని తెలిపారు. శానిటరీ సర్టిఫికెట్ పొందాలనీ, ఫైర్స్టేఫ్టీ ఉండాలని పేర్కొన్నారు. గదికి 30 మందికి మించి ఉండొద్దని వివరించారు. ఇవేవీ ఆయా సెంటర్లు పాటించడం లేదని విమర్శించారు. ఫంక్షన్‌హాళ్లు, అద్దె భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. గాలి, వెలుతురు లేకుండా ఇరుకు గదువు, చీకట్లోనే వందల మందిని కుక్కి రోజంతా బోధన సాగిస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ఉదయం ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నాయని వివరించారు. అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.