Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్, గిరిజన సంక్షేమ శాఖ ఏడీకి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అతిపెద్దదైన దసరా పండుగ నాడు గిరిజన కార్మికులను పస్తులుంచుతారా? అని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్,ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో ఈ మేరకు ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కె. తారక రామారావుకు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు కమిషనర్ సర్వేశ్వర్రెడ్డికి ఆ యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఒక్కో జిల్లాలో ఐదు నుంచి 14 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్ తీసుకెళ్లారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు 16 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. వేతనాలు లేకుండా పని చేయించుకోవడం చట్ట వ్యతిరేకమని ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలో పార్ట్‌టైమ్ పేరుతో రోజుకు 16 గంటల పని చేయిస్తున్నారనీ, వారికి పూర్తి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్లు కనీస వేతనాల సర్క్యులర్‌ను అమలు చేసేలా అదేశించాలని కోరారు. ఐదేండ్ల సర్వీసున్న అందర్నీ పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. వాటికి పరిష్కారానికి కృషి చేస్తామంటూ అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్టు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె. రమేష్, ఆ యూనియన్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, ఉపాధ్యక్షులు రత్నం రాజేందర్, నందులాల్, జి. రాములు, పద్మ, నారాయణ, టి. శ్రీనివాస్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.