Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజుల ఖరారుపై టీఏఎఫ్ఆర్సీ దృష్టి
- పలు ఇంజినీరింగ్ కాలేజీలతో మళ్లీ విచారణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పలు ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులు తప్పులతడకగా ఉన్నాయని తెలంగాణ అడ్మిషన్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గుర్తించింది. అందుకే కాలేజీ యాజమాన్యాలతో మళ్లీ ఆ కమిటీ విచారణ చేపడుతున్నది. సోమవారం సీబీఐటీ, వాసవి, అనురాగ్, కిట్స్ (వరంగల్), శ్రీఇందు, సెయింట్, గురునానక్, సీఎంఆర్, సీఎంఆర్ టెక్నికల్, కేఎంఐటీ, హితమ్, జేబీఐటీ, కేశవ్ మెమోరియల్, కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, నారాయణ, సెయింట్ కాలేజీ యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మంగళవారం 29 కాలేజీలను సంప్రదింపులకు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ మరో రెండు, మూడు రోజులపాటు ఉండే అవకాశముందని తెలిసింది. 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాలకు ఫీజుల ఖరారుపై టీఏఎఫ్ఆర్సీ దృష్టి సారించింది. అయితే ఫీజుల ఖరారులో ఆడిటర్ల వల్ల కొన్ని తప్పులు దొర్లినట్టు టీఏఎఫ్ఆర్సీ గుర్తించింది. రాష్ట్రంలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీకి గత బ్లాక్ పీరియెడ్‌లో ఉన్న ఫీజు కంటే రూ.పది వేలు తక్కువగా టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. దీనిపై ఆ కాలేజీ మళ్లీ విచారణ చేపట్టి ఫీజు ఖరారు చేయాలని కమిటీని కోరింది. దీంతో ఆ కాలేజీ ఆదాయ, వ్యయాలను ఆడిటర్లతో తనిఖీ చేయించింది. అందులో కొన్ని తప్పులు దొర్లినట్టు గుర్తించారు. ఇలా ఇంకెన్ని కాలేజీలున్నాయో పరిశీలిస్తే సుమారు 50 వరకు లెక్కతేలాయి. వాటిని మళ్లీ విచారణకు పిలిచి ఫీజులను ఖరారు చేసే పనిలో టీఏఎఫ్ఆర్సీ అధికారులు నిమగమయ్యారు. అయితే ఈ విచారణలో గతంలో ఖరారు చేసిన ఫీజులు తగ్గొచ్చు, పెరగొచ్చు అని ఓ అధికారి వివరించారు. ఈ విచారణ ప్రక్రియ ముగిశాక ఈ వారంలతోనే టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం జరిపి ఫీజుల ఖరారుపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించే అవకాశమున్నది. ఆ తర్వాత ఇంజినీరింగ్ ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయి.