Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యం
- త్వరలో 300 కొత్త బస్సులు కొనుగోలు
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ అభివృద్ధే లక్ష్యంగా ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. త్వరలో సంస్థ కోసం 300 ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ చైర్మెన్‌గా నియమితులై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్థన్ నియమితులయ్యాక సంస్థ స్థితిగతులు, వాటిని గాడిన పెట్టేందుకు ఆయనే స్వయంగా అనేక నిర్ణయాలు, సంస్కరణలు తీసుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించినట్టు పేర్కొన్నారు. తన హయాంలో ఆర్టీసీ ప్రగతి చక్రం పరుగులు పెడుతున్నదనీ, అటు సంస్కరణలు ఇటు ఆదాయం పెంపు, నష్ట నివారణ కోసం సంస్థను గాడిన పెడుతున్నాననీ చెప్పుకొచ్చారు. ఆదాయం పెంచుకొనేందుకు 30 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, ప్రయాణికులు, సంస్థ సిబ్బందికి అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మన్ననలు పొందినట్టు తెలిపారు. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో సిబ్బంది కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ స్టాఫ్, సంస్థ సిబ్బంది అంతా తనకు సహకరిస్తున్నారని తెలిపారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, జాతీయ పండగలను దష్టిలో ఉంచుకొని ప్రత్యేక రాయితీలు, పిల్లలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. 2021 - 2022లో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలను ఆయన వివరించారు. తిరుపతికి దర్శనంతో సహా ప్రయాణ టిక్కెట్ బుక్ చేసుకొనే సౌకర్యం, నిజామాబాద్ నగరంలో నూతనంగా ఆర్టీసీ మినీ సిటీ బస్ సర్వీసులు ప్రారంభించడం, కోస్గిలో నూతన బస్‌స్టేషన్, డిపోల ప్రారంభం సహా అనేక అంశాలను ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఒకటి, వరంగల్‌లో రెండు ఐటీఐ కాలేజీల్లో త్వరలో తరగతులను ప్రారంభించ డానికి ఏర్పాట్లు చేస్తున్నామనీ, త్వరలోనే 1200 కారుణ్య నియామకాలు చేపడతామనీ, సంస్థ ఆధ్వర్యంలో జీవ ప్రత్యేక బ్రాండ్‌తో వాటర్ బాటిళ్లను ప్రారంభిస్తామనీ తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అక్టోబర్ నెల జీతంతో పాటు ఒక డీఏను అందిస్తున్నట్టు వివరించారు.