Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీల విద్య, ఆర్థిక సంక్షేమానికి ప్రాధాన్యత
- షాదీముబారక్ ద్వారా రూ. 1,751 కోట్ల ఆర్థిక సహాయం
- సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రూ.6.30 కోట్లు మంజూరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు భారతదేశంలో వందల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనంతగా తెలంగాణ ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది షాదీ ముబారక్ పథకం. పేద మైనారిటీ కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డ ఎదుగుదల, విద్యాభివృద్ధికి, బాల్య వివాహాలను అరికట్టేందుకు షాది ముబారక్ పథకం దోహదకారిగా నిలిచింది. పేదింటి అల్పసంఖ్యాక వర్గాల ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షాదీముబారక్ పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఈ పథకం కింద ఆల్పసంఖ్యాక వర్గాల యువతుల వివాహానికి రూ.51వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా,ఆ తరువాత రూ75,116కు పెంచారు. మార్చి 19, 2018 నుంచి ఆ మొత్తాన్ని రూ. 1,00,116 లకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది. షాదీముబారక్ కింద ఇప్పటివరకు 2,17, 565 మంది ఆడబిడ్డలకు రూ. 1,751 కోట్లను ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను, ఈ పథకం కోసం రూ.300 కోట్లను కేటాయించడం విశేషం.ఈ పథకం నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నది . పథకం ద్వారా లబ్ది పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది తరువాత కేసీఆర్ కిట్లను అందుకోవడం మరో విశేషం. దీంతో పాటు ఆల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికోసం మైనారిటీ గురుకులాల సంఖ్యను 12నుంచి 192 పెంచింది. అందులో 50 శాతం గురుకులాలను అల్పసంఖ్యాక వర్గాల బాలికల కోసమే ప్రత్యేకంగా కేటాయించింది. వాటి ద్వారా మొత్తం లక్షా 14 వేలమంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద ఇప్పటివరకు రూ.6.30 కోట్ల ఆర్ధిక సహకారాన్ని అల్పసంఖ్యాక వర్గ విద్యార్థులకు అందించడం విశేశం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 100 కోట్లు ఈ పథకం కోసం కేటాయించారు. మైనారిటీల సంక్షేమంలో భాగంగా నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్ -ఉల్ - గుర్బాను రూ.40 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు. మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే 10 వేలమంది ఇమాం, మౌజంలకు నెలకు రూ.5 వేలచొప్పున ప్రభుత్వం గౌరవవేతనం అందిస్తున్నది. రంజాన్ కానుకగా 4.65లక్షల మందికి, క్రిస్టమస్ పండుగకు ఏటా సుమారు 5లక్షల మందికి కొత్తబట్టలను కానుకగా అందిస్తున్నది.వీటితోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీచేస్తున్న వివిధ పోస్టులకు జిల్లాల్లో ఉచిత కోచింగ్ ఇస్తున్నదని సమాచార పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.