Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబినెట్లో చర్చించి న్యాయం చేస్తాం.. తెగేదాకా లాగొద్దు
- సానుకూలంగా సీఎం కేసీఆర్: వీఆర్ఏ జేఏసీ నేతలకు మంత్రి కేటీఆర్ విన్నపం
- సమ్మె విరమణపై ఆలోచించుకుని చెబుతామన్న జేఏసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే మీరు అడుగుతున్నరు. మీ డిమాండ్లన్నీ న్యాయమైనవే. వాటిలో కొత్తవేం లేదు. మీ సమ్మె న్యాయమైనదే. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉంది. తదుపరి జరిగే క్యాబినెట్లో వీఆర్ఏలపైనే ప్రధాన ఎజెండాగా పెట్టి మాట్లాడుతాం. తప్పనిసరిగా న్యాయం చేస్తాం. దయచేసి సమస్యను తెగేదాకా లాగొద్దు. ఆలోచించండి. సమ్మె విరమించండి. రాష్ట్రంలో అసలే రాజకీయ పరిస్థితులు బాగోలేవు' అని మంత్రి కేటీఆర్ విన్నవించారని వీఆర్ఏ జేఏసీ నేతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో గల మెట్రో రైల్ భవన్లో వీఆర్ఏ జేఏసీ నేతలతో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రెవెన్యూశాఖ ఉన్నతాధికారి శివశంకర్ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వీఆర్ఏ జేఏసీ ప్రతినిధి బృందం నుంచి ఒకరు మంత్రి కేటీఆర్‌కు తమ డిమాండ్లను, సమ్మె చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పుడే జీవో విడుదల చేస్తే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. పేస్కేలు అమలు, వారసత్వ ఉద్యోగాలు, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో పాటు సొంతూరులో ఇండ్లు కట్టిస్తామనే హామీని కూడా నెరవేర్చాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...కొద్ది మందికే న్యాయం జరుగుతుందని పత్రికల్లో వస్తున్న వార్తలను నమ్మకూడదని కేటీఆర్ సూచించారని వీఆర్ ఏ జేఏసీ నేతలు చెప్పారు. వీఆర్ఏలందరికీ న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు నొక్కి చెప్పారన్నారు. వీఆర్లకు, ప్రభుత్వానికి తండ్రీపిల్లల లాంటి సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారని తెలిపారు. వీఆర్ఏల పోరాటంలో న్యాయముందనీ, వీలైనంత త్వరలో సమస్య పరిష్కరానికి కషి చేస్తామని చెప్పారని వివరించారు. మీరు చెప్పిన వివరాలన్నింటినీ నోట్ చేసుకున్నామనీ, సీఎంతో చర్చించి క్యాబినెట్లో అప్రూవల్ చేసి ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి కొంచెం సమయం ఇచ్చి ఓపిక పట్టాలని కోరారని తెలిపారు. దానికి 15 రోజులు పట్టొచ్చు..నెల పట్టొచ్చు..అంతకంటే ఎక్కువే పట్టొచ్చు...కానీ సమస్య మాత్రం పరిష్కరిస్తామని భరోసానిచ్చారని చెప్పారు. సమ్మెతో కొనసాగిస్తూ సమస్యను తెగేదాకా లాగొద్దని మంత్రి కోరారని తెలిపారు. వచ్చే క్యాబినెట్లో ఫస్టు వీఆర్ఏల సమస్యలపైనే చర్చిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తమ మీద ఈ ఒక్కసారి నమ్మకం ఉంచి సమ్మె విరమించాలనీ, నాయకులుగా మీరు వీఆర్ ఏలకు నచ్చజెప్పాలని మంత్రి కోరారని తెలిపారు. అయితే, తాము ఇప్పటికైతే సమ్మె విరమించట్లేదని జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ చర్చల్లో వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ ఎం.రాజయ్య, కో చైర్మెన్ రమేశ్ బహదూర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో కన్వీనర్లు వంగూరు రాములు, ఎస్కే మహ్మద్ రఫీ, వెంకటేశ్ యాదవ్, కె.శిరీషారెడ్డి,గోవింద్, నర్సింహారావు, మాధవనాయుడు, అనిత పాల్గొన్నారు.
సమ్మె యథాతధం...నేడు హైదరాబాద్‌లో జేఏసీ మీటింగ్
సమ్మె యధావిధిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. మంత్రితో చర్చల అనంతరం ఇందిరాపార్కు వద్ద జేఏసీ నేతలు 300, 400 మంది వీఆర్ఏలతో కలిసి సమావేశమయ్యారు. అక్కడ సమ్మె విరమణపై చర్చించగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో సమ్మె విరమిద్దామని కొందరు వాదించగా... మరికొందరు సమ్మె కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. బుధవారం హైదరాబాద్‌లోని యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో జిల్లా చైర్మెన్లతో జేఏసీ కీలక సమావేశం ఉంటుందని నేతలు తెలిపారు. అక్కడ కింది స్థాయిలో వీఆర్ఏల నుంచి వస్తున్న సూచనలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించారు.