Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతవాళ్లను పక్కనబెట్టేసిన కోమటిరెడ్డి
- ఆయన తీరుతో మీటింగ్‌లకు వెళ్లని మండలాధ్యక్షులు
- సైలెంట్ అయిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. మనోహర్‌రెడ్డి
- రాష్ట్రనేతల్లోనూ విభేదాలు సృష్టిస్తున్న ఉప ఎన్నిక
- నేతల తీరుతో తల పట్టుకుంటున్న అధిష్టానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతిష్టాత్మక ఉప ఎన్నికకు ముందే మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నిలువునా చీలిపోయింది. అంతేకాదు, ఆ పార్టీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒంటెత్తు పోకడ అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారవుతున్నది. ఆ పార్టీని మొదటి నుంచీ నమ్ముకుని ఉన్నవాళ్లను రాజగోపాల్‌రెడ్డి ఎక్కడా పట్టించుకోవట్లేదనే విమర్శ బహిరంగంగా వినిపిస్తున్నది. ఎక్కడికెళ్లినా తన అనుచరులతో హడావిడి చేస్తున్నారే తప్ప పాతవారికి ఎక్కడా గౌరవించట్లేదనే ప్రచారం జరుగుతున్నది. ఛాలెజింగ్ పోరులో ఆ పార్టీ నియోజకవర్గ నేతల తీరుతో అధిష్టానం తలలు పట్టుకుంటున్నది. పాత, కొత్త నేతలకు సర్ధిచెప్పేందుకు నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యనేతలకు 'కరవమంటే కప్పకుకోపం..విడవమంటే పాముకు కోపం' అన్న పరిస్థితి ఎదురవుతున్నది. అక్కడ గతం నుంచి పోటీచేస్తూ వస్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్‌రెడ్డి సైలెంట్ అయిపోయారు. రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ తనకేం పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీని గతం నుంచి అంటి పెట్టుకుని ఉండేవారికి, కొత్తగా వచ్చి చేరుతున్న వారికి సమన్వయలేమి కొరవడింది. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఉన్న అరకొర అవకాశాలు కూడా పూడ్చుకుపోతున్నాయి. మరోవైపు ఈటల, వివేక్, జితేందర్‌రెడ్డిలను తన ప్రచారం కోసం కేటాయించాలని బీజేపీ అధిష్టానానికి, అమిత్‌షాకు ప్రతిపాదనలు పంపారు. దీనిపైన పార్టీలోని సీనియర్ నేతలైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మునుగోడు నియోజకవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన గంగిడి మనోహర్‌రెడ్డికి 27,434 ఓట్లు పడ్డాయి. ఇప్పటిదాకా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి పడ్డ అత్యధిక ఓట్లు అవే. ఆసారి 16 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. 2018 ముందస్తు ఎన్నికల్లో అదే అభ్యర్థికి 12,745 ఓట్లు వచ్చాయి. ఎట్లాగూ మనోహర్‌రెడ్డి గెలవరనే ఉద్దేశంతో టీఆర్ఎస్మీద ఉన్న అసంతృప్తితో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల గెలవకూడదనే ఉద్దేశంతో చివరకు బీజేపీ అభిమానులతో పాటు అన్ని పార్టీల నుంచీ క్రాస్ ఓటింగ్ జరిగి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటేశారు. అది కోమటిరెడ్డికి కలిసొచ్చింది. ఆనాడు తన గెలుపునకు పరోక్షంగా సహాయపడిన వారిని రాజగోపాల్‌రెడ్డి పక్కనబెట్టడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మొదటి నుంచి బీజేపీనే నమ్ముకుని ఉంటున్న నేతలెవ్వర్నీ ఆయన దగ్గరకు రానివ్వట్లేదు. పైగా, 'పాతోళ్లవల్ల ఒరిగేదేం లేదు..ఓట్లు పడవు సావవు' అంటూ కొత్తవాళ్లు నెగెటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీన్ని పాతవాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ధోరణి పాతవారికి నచ్చట్లేదు. దీంతో వారు రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మునుగోడు మండలాధ్యక్షులు, పలివెల సర్పంచి బాలరాజు ఇటీవల ఓ సమావేశంలో 'నేను మండలాధ్యక్షున్ని. నాకేం చెప్పకుండా చేయడమేంటి? అసలీ కొత్తోళ్ల పెత్తనమేంటి? మేం ఇన్నేండ్ల నుంచి పార్టీలో ఉంటున్నందుకు ఇచ్చే గౌరవమిదేనా?' అంటూ తీవ్ర అసహనంతో మైకు నేలకొసికొట్టి సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అతనిది స్వయానా ఈటల రాజేందర్ అత్తగారి ఊరు కావడం గమనార్హం. అదే మండలానికి చెందిన మరో సీనియర్ నేత రావుల ఎల్లప్ప కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలాధ్యక్షులు విక్రమ్ కూడా అలకపూనారు. కోమటిరెడ్డి పార్టీకి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా సమావేశాలు, చేరికలను ప్రోత్సహించడంతో అక్కడా రెండు గ్రూపులు అయ్యాయి. రాజగోపాల్‌రెడ్డి ఓటమికి పనిచేస్తామని కొందరు పాత నేతలు బాహాటంగానే చెబుతుండటం చర్చనీయాంశం అవుతున్నది. చౌటుప్పల్ మండలంలోనూ ఇదే పరిస్థితి. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డికి, పాత నేతలకు అస్సలు పొసగడం లేదు. మొదట ఆయన రాకను పూర్తిగా వ్యతిరేకించారు. కానీ పట్టుబట్టి ఈటల రాజేందర్ ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చారు. కాస్తోకూస్తో కొంత పట్టున్న చౌటుప్పల్‌లోనూ గ్రూపు మధ్య విభేదాలు లోలోన రగిలిపోతున్నాయి. చండూరు మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు కూడా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు. మరిగ్రూడెం మండలాధ్యక్షుడ్ని కూడా రాజగోపాల్‌రెడ్డి దూరం పెట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ అమిత్‌షా దృష్టికి వెళ్లారు. 'కాంగ్రెస్ క్యాడర్‌ను తీసుకురాలేకపోయావు? ఉన్న పార్టీ శ్రేణులను దూరం పెడుతున్నావ్? అస్సలు ఎట్ల గెలుస్తవ్?' అంటూ బీజేపీ కోర్‌కమిటీ మీటింగ్‌లో రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతున్నది. గత ఎన్నికల్లో చాలా మేరకు టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో బీజేపీ, ఇతర పార్టీల క్రాస్ ఓటింగ్‌తో గట్టెక్కిన రాజగోపాల్‌రెడ్డికి ఈ పరిణామాలన్నీ మింగుడు పడని అంశాలే. ప్రస్తుతం వామపక్షాల ఓటింగ్ ఆయనకు అస్సలే పడే అవకాశం లేదు. గతంలో ఓట్లేసిన బీజేపీ వాళ్లు కూడా ఆయనంటే చీదరించుకుంటున్నారు. దీనికి తోడు డబ్బుల రాజకీయం, కనిపించిన వారికల్లా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా సొంత డబ్బులతో రోడ్లేపిస్తా...పనులు చేయిస్తా అని ఎడాపెడా హామీలిస్తూ పోయారు. అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా, గెలిచినప్పటి నుంచి రాజీనామా చేసేదాకా ఆయన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించింది అరకొరనే. ఈ పరిణామాలన్నీ రాజగోపాల్‌రెడ్డికి ప్రతికూలంగా మారబోతున్నాయి.