Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు, పేదల పొట్టకొట్టే దుర్మార్గపు చర్య: తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యాపారుల కోసమే ధాన్యం సేకరణ బాధ్యత నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఇది రైతులతోపాటు పేదల పొట్టకొట్టే దుర్మార్గపు చర్య అనీ, ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉపసంహరించుకున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాల్లోని అంశాల ఆధారంగానే ఇప్పుడు ధాన్యం సేకరణ నుంచి కేంద్రం వైదొలగాలని నిర్ణయించిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయివేటు, కార్పొరేట్ల సంస్థలకు ధాన్యం సేకరణకు అవకాశం కల్పిస్తూ వచ్చే సీజన్‌కు దీన్ని అమల్లోకి తెస్తామంటూ కేంద్ర పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రకటన చేయించి రాష్ట్రాలకు ఆదేశాలు పంపిందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల దేశంలో ఆహార ధాన్యాలు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఖరీప్, రబీలో పూర్తిగా ఆహార ధాన్యాన్ని కేంద్రం సేకరించలేదని తెలిపారు. రాష్ట్రాలపై ఆంక్షలు విధించిందని విమర్శించారు. దీంతో బియ్యం, గోధుమల ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. నూకలు ఎగుమతి నిలుపుదల చేసి బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాలు పెంచారని తెలిపారు. మద్దతు ధర రాక రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. బియ్యం, గోధుమల ధరలు పెరిగి వినియోగదారులు, పేదలు ఆహార ధాన్యాల మీద అధిక ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళికలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ మోడీ గొప్పలు చెప్పి ఎనిమిదేండ్లుగా వారి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, సేద్యం ఖర్చులు విపరీతంగా పెంచారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు ఊసేలేదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ కోసం తెచ్చిన మూడు నల్లచట్టాల పోరాటంలో 750 మంది రైతుల బలయ్యారని గుర్తు చేశారు. మద్దతు ధర చట్టం తెస్తామంటూ ప్రకటించి కొంతమంది వందిమాగదులతో కమిటీ వేసి తప్పించుకున్నారని విమర్శించారు. కేంద్రం ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి ఉపసంహరించుకుంటే దేశంలో బ్లాక్‌మార్కెట్ జరిగి పేదలకు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని తెలిపారు. ధాన్యం సేకరణకు ఇస్తామంటున్న రెండు శాతం ఖర్చులు ఏమాత్రం సరిపోవని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రాలూ భారమై సేకరణ నిలిపివేసే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ చర్య వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టి రైతాంగాన్ని దోచుకోవడానికేనని విమర్శించారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలే ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.