Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూం ఇండ్లు, స్థలాలు, పింఛన్లు అర్హులకే ఇవ్వాలి : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య
నవతెలంగాణ -వనపరి
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఇంకా ఎన్నేండ్లు కావాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్.వీరయ్య ప్రశ్నించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం పేదలు చేపట్టిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, పేదలంతా కలిసి ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. సీఎం హామీ ఎనిమిదేండ్లుగా నీటి మూటగానే మిగిలిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,60,000 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని, మూడేండ్ల కిందటే కొన్ని వేల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అనేక సభల్లో సీఎం చేప్పారని గుర్తు చేశారు. అయితే, వాటిని నేటికీ పేదలకు పంచకుండా తాళాలు వేశారని, దాంతో కట్టిన ఇండ్లు పాడవుతున్నాయని, పందికొక్కులు తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తికానివి అలాగే ఉంటే.. పూర్తయిన వాటిని లబ్దిదారులకు పంచకుండా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ంాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ వంటి పథకాలు తెచ్చి కొన్ని వందల ఇండ్లు కట్టించి ఇచ్చిందన్నారు. కానీ, ఇప్పుడు ఇండ్లు ఇవ్వడానికి ఇంకెన్నేండ్లు పడుతుందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నిర్మించిన ఇండ్లను తక్షణమే అర్హులందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదలందరినీ ఏకం చేసి తాళాలు పగులగొట్టి ఇండ్లను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతున్నాయని, వనపర్తిలో అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వమే లబ్దిదారులకు కేటాయించాలని, అంతవరకు లబ్దిదారులు పోరాటం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు ఎండి.జబ్బార్, పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, ఏం.రాజు, గోపాలకృష్ణ, ఏ.లక్ష్మి, సాయిలీల, రేణుక, పరమేశ్వరచారి, ఎన్ రాములు, గట్టయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.