Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.30వేల లంచం తీసుకుంటూ చిక్కిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్
నవతెలంగాణ-బడంగ్పేట్
ఏసీబీ వలలో 'బుల్లెట్‌బండి' పెండ్లి కొడుకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న అశోక్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..సరూర్‌నగర్‌కు చెందిన దేవేందర్‌రెడ్డి సోదరుడు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రెండు ఇండ్ల నిర్మాణం కోసం టౌన్ ప్లానింగ్ సెక్షన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి అశోక్ రూ.60 వేలు డిమాండ్ చేయగా.. ప్లానర్ శ్రీనివాస్ రాజు రూ.50 వేలకు మాట్లాడారు. అందులో భాగంగా ముందుగానే దేవేందర్ రెడ్డి రూ.20వేలు ఇచ్చాడు. మిగతా రూ.30వేలు ఇస్తేనే ఇండ్లకు అనుమతి ఇస్తానని అధికారి అశోక్ చెప్పడంతో గత్యంతరం లేక సెప్టెంబర్ ఒకటో తేదీన దేవేందర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం రూ. 30 వేలు తీసుకురావాలని టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ దేవేందర్ రెడ్డికి చెప్పాడు. దీంతో దేవేందర్‌రెడ్డి, ఏసీబీ అధికారుల సహకారంతో అశోక్‌కు డబ్బులు ఇవ్వడానికి వెళ్లగా, ప్లానర్ శ్రీనివాస్ రాజుకు ఇవ్వాలని సూచించారు. దేవేందర్ రెడ్డి శ్రీనివాసరాజుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి అధికారితోపాటు అతనికి సహకరించిన ప్లానర్ శ్రీనివాస్ రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, నాగోల్‌లోని అశోక్ ఇంటిపై సోదాలు చేశారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
బుల్లెట్ బండి పాట డ్యాన్స్ ఫేమ్‌గా..
అయితే, అశోక్ బుల్లెట్ బండి ఫేమ్‌గా గుర్తింపు పొందారు. ఆయన పెండ్లి సందర్భంగా బుల్లెట్ బండి పాటకు వధువు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ అయింది. 2021లో మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన యువతితో రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్ వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో వధువు.. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అన్ని సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది.