Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసం ఈనెల తొమ్మిది నుంచి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనీ, సమ్మె విరమణకు పూనుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్రకార్యదర్శి మురహరి, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బండా సురేందర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణిలో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఈనెల తొమ్మిది నుంచి సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. 12 రోజులుగా వారు సమ్మె చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎల్, టీఎన్టీయూసీ కార్మిక సంఘాలు జెఏసీగా ఏర్పడి పోరాడుతున్నాయని గుర్తు చేశారు. సివిల్ సివిక్, అన్వేషణ విభాగం, బ్లాస్టింగ్, బొగ్గు రవాణా, హాస్పిటల్, కన్వెయన్స్ డ్రైవర్స్, సెక్యూరిటీ తదితర 40 విభాగాల్లో సమ్మె కొనసాగుతున్నదని తెలిపారు. బోనస్, ఓవర్‌టైం, టీఏ, డీఏల రూపంలో వారు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు జీవో ఎంఎస్ నెంబర్ 22 ప్రకారం జీతభత్యాలు, గని కార్మికులకు చెల్లిస్తున్న విధంగా అమలు చేయాలనీ, సమానపనికి సమానవేతనం చెల్లించాలని వారు కోరారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలనీ, కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారం రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సూచించారు. నర్సరీ సలబ్, ఓబీ హెల్పర్, వేబ్రిడ్జి లోడింగ్, అన్లోడిరగ్ కార్మికులకు కనీసవేతనాలతోపాటు బోనస్ అమలు చేయాలని కోరారు. పీఎఫ్ చెల్లించాలనీ, ఈఎస్ఐ హాస్పిటల్ లేదా సింగరేణి వైద్యశాలల్లో కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని తెలిపారు. ఈ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి సమ్మె విరమింప చేయాలనీ, యాజమాన్యానికి తగు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ వారి పోరాటాల్లో పాల్గొంటామని ప్రకటించారు.