Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి : ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత
నవతెలంగాణ-సిద్దిపేట
ఇంటి పనివార్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్నేహ ఇంటి పనివారల సంఘం (ఐద్వా) సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి నవీన అధ్యక్షతన సిద్దిపేటలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఇంటి పని వారికి సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పని చేసే మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, శ్రమదోపిడికి గురవుతూ మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో సతమవుతున్న వారికి కార్మిక గుర్తింపు కార్డులిచ్చి ఈఎస్ఐ అమలుచేయాలని డిమాండ్ చేశారు. వారి హక్కులు, సమస్యల పరిష్కారానికి సంఘం ఏర్పాటుచేసుకొని పోరాడాలనే ఆలోచనతోనే స్నేహ ఇంటి పనివారుల సంఘం నూతన జిల్లా కమిటీని 11 మందితో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా స్నేహ వంటిపనివార్ల సంఘం అధ్యక్షులుగా దండు లక్ష్మి, కార్యదర్శిగా అమూల్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా జిల్లా కన్వినర్ కళావతి, నాయకులు అనిత, కనకవ్వ, మల్లవ్వ, రాజేశ్వరి, పద్మ, లావణ్య, మంజుల , సిహెచ్ పద్మ, మహేశ్వరి, రజిని, బుధవ్వ, కనకవ్వ, రమణ, పోశవ్వ, తదితరులు పాల్గొన్నారు.