Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ-కొడకండ్ల
జనగామ జిల్లా కొడకండ్లలో రెండ్రోజుల కిందట కిడ్నాపైన బాలుడు పాడుబడిన బావిలో శవమై కనిపించాడు. వివరాల్లోకెళ్తే... సంచార జాతులుగా పిలవబడే కంచరి వాళ్లు ఆరు నెలలుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలో డేరాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా, ఈ నెల 18న సంచార జాతులకు చెందిన బాలుడు షబ్బీర్(5)ను వరుసకు బావ అయిన మహబూబ్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వారు నివాసానికి 300 మీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్లు వెనుక భాగంలో పాత బావిలో మంగళవారం సాయంత్రం బాలుని మృతదేహం లభించింది. కాగా, మహబూబే పడేసి పరారయినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం షబ్బీర్ తండ్రి జమాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ కొమురెల్లి కేసు దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ పరారీలో ఉండటంతో అతనే నిందితుడని జమాల్ పోలీసులకు తెలిపాడు. ఎస్ఐ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా విడిపోయిన పోలీసులు మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం మామిడిపల్లి గ్రామంలో నిందితుడు సంచరిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. నిందితుడు పత్తి చేనులో సంచరిస్తుండగా 20 మంది కూలీల సహకారంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించారు. మండల కేంద్రంలోని పాతబడ్డ బావిలో పడేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. దాంతో పాడుపడిన బావి దగ్గరికు వెళ్లి షబ్బీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక తహసీల్దార్ చంద్రమోహన్ సహకారంతో పోలీసులు శివపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియాస్పత్రికి తరలించారు. అభంశుభం తెలియని బాలుడు షబ్బీర్ మృతితో బాధిత కుటుంబాలు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.