Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏచూరి మాటలను వక్రీకరించిన ఓ వర్గం మీడియా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాజ్యాంగాన్ని మార్చాలనే అంశంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యల్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయి. ఆయన వ్యాఖ్యలను కత్తిరించి, సంచలనం చేయడం కోసం ప్రయత్నించాయి. దానిలో భాగంగా 'రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు' అంటూ శీర్షికలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఆదివారం జరిగిన పత్రికా సమావేశం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్న తీరుపై సీతారాం ఏచూరి మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే బీజేపీని అధికారానికి దూరం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఓ పత్రికా విలేకరి 'సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారనీ, దానిపై మీరేమంటారు? అని ప్రశ్న వేశారు. దీనికి సీతారాం ఏచూరి సమాధానం చెప్తూ ''చాలా అంటుంటారు. రాజ్యాంగాన్ని మార్చాలని మేమూ అంటుంటాం. మౌలిక అధికారం ఫండమెంటల్ రైట్ ఎంప్లారుమెంట్ ఉండాలి. కానిస్టిట్యూషన్ (రాజ్యాంగం)లో ఇప్పుడది లేదు. రైట్ టు హౌసింగ్, రైట్ టు హెల్త్ ఫండమెంటల్ రైట్‌గా ఉండాలి. అది మేము కోరుకుంటాం. అదికాదు ఈరోజు ఉన్న ముఖ్య ప్రశ్న. బీజేపీని అధికారానికి దూరంగా పెడితే తప్ప భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం కాపాడలేం'' అని వివరంగా చెప్పారు. రాజ్యాంగంపై ఆయన ఇంత స్పష్టంగా చెప్తే, ఆ మాటల్లోని ముందు, తర్వాతి వ్యాక్యాలను ఎడిట్ చేసి (కత్తిరించి) రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని ఆయన డిమాండ్ చేసినట్టు ఆ పత్రికల్లో ప్రచురించారు. ఇది కేవలం సంచలనం కోసం చేసిన ప్రయత్నంగానే కనిపిస్తున్నది. సీపీఐ(ఎం) తెలంగాణ ఫేస్బుక్ పేజ్‌లో ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన లైవ్ వీడియో అందుబాటులో ఉంది. దానిలో సీతారాం ఏచూరి ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలన్నీ వివరంగా ఉన్నాయి.