Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల రిజర్వేషన్లను ఆమోద ముద్ర వేసే బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినా కేంద్ర హౌంమంత్రిత్వశాఖ స్పందించలేదని గుర్తుచేశారు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పానికి అడ్డుపడుతూ, లేనిపోని సాకులు చూపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసిన కేంద్ర హౌంశాఖకు పంపి ఐదేండ్లయిందనీ, గత జూలైలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర హౌంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారనీ, ఎంపీలుగా తనతో పాటు ప్రొఫెసర్ సీతారాంనాయక్ పార్లమెంటులో ప్రస్తావించామని వినోద్ కుమార్ చెప్పారు. మంత్రి సత్యవతి రాసిన లేఖకు, కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా, మైనార్టీల రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో తేలే వరకు గిరిజన రిజర్వేషన్లపై ఏ నిర్ణయం తీసుకోలేమని లేఖ రాశారని తెలిపారు. ఎలాంటి వివాదం లేని గిరిజన రిజర్వేషన్లకు కేంద్రం ఎందుకు ఆమోదం తెలపడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఒప్పించాలని డిమాండ్ చేశారు.