Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి : తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎరువుల సబ్సిడీ సొమ్మును రైతులకు నగదు రూపంలో బదిలీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ధాన్యసేకరణ ప్రయివేటుకు అప్పగించాలనే వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ తాను నియమించుకున్న శాంతకుమార్ కమిటీ కమిషన్ నివేదికను క్రమంగా అమల్లోకి తెస్తున్నారని విమర్శించారు. భారత ఆహార సంస్థను (ఎఫ్సీఐ), కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థలను రద్దు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న సబ్సిడీని నగదుగా చెల్లించాలంటూ ఆ కమిటీ సలహా ఇచ్చిందని గుర్తు చేశారు. వాటితోపాటు ఎరువుల సబ్సిడీలో కోత అందుకు బదులుగా నగదు బదిలీ చేయాలని చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఈ నివేదికకు వ్యతిరేకంగా 2015 నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. 2020-21లో ఎరువుల సబ్సిడీ కింద రూ.1,28,761 కోట్లు చెల్లించిందనీ, 2021-22లో రూ. 1,40,703 కోట్లు మాత్రమే చెల్లించిన కేంద్రం...2022-23కు రూ. 1,05,262 కోట్లకు తగ్గించిందని విమర్శించారు. దీనిని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. దేశంలో డీఏపీ ఉత్పత్తి ఖర్చు 50కిలోలకు రూ. 3,500 అవుతాయనీ, దీన్ని రూ.1300లు ఇస్తున్నారని తెలిపారు. యూరియా బస్తాకు ఉత్పత్తి ఖర్చు రూ.1500లు అవుతుందని పేర్కొన్నారు. దీనిని రూ.280 మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నగదు సబ్సిడీతో సగం బస్తా డీఏపీ మాత్రమే వస్తుందని తెలిపారు. దీంతో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభ్యం కావని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి, ఉత్పాదకత దెబ్బతింటుందనీ, ఆహార సబ్సిడీ పొందే వినియోగదారులకు వారి కోటాలో 50శాతం కోత పెడుతుందనీ, తద్వారా పేదలు ఆకలి చావులకు గురికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.