Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్లకు జియో ట్యాగింగ్ పెట్టడం, జీపీఎస్ మిషన్లు అమర్చాలనుకునే సర్కారు నిర్ణయం సరికాదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, డాక్టర్ దీన్ దయాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు జియోట్యాగింగ్, జీపీఎస్ మిషన్లపై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు దేవుళ్లు కారనీ, అలాగే జంతువులు కూడా కాదంటూ మనుషులుగా ఒకరిద్దరు తప్పు చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. కరోనా సమయంలో డాక్టర్లు అందించిన అలుపెరగని సేవలను గుర్తుచేసుకోవాలని కోరారు. 24 గంటల వైద్య సేవల కోసం మూడు షిఫ్టుల విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య విభాగం పరిధిలో పని చేసే వారికి టైంబాండ్ పదోన్నతులు, డాక్టర్లకు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో పని చేసే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం దారుణమంటూ వెంటనే వారికి ఆరోగ్య కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సరిపోయేంతగా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతుంటే ఆరోగ్యరంగంపై కొంత మంది అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అక్కడక్కడా జరిగే పొరపాట్లకు డాక్టర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు.