Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021 ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. కేంద్ర నేర రికార్డుల విశ్లేషణా సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో కలకత్తా ప్రథమ స్థానంలోనూ, పూణె ద్వితీయ స్థానంలో ఉండగా హైదరాబాద్ మహానగరానికి మూడవ స్థానం దక్కింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని సమాచార పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో రెండు మిలియన్ల జనాభా ఉన్న నగరాల్లో విచారణకు అర్హమైన నేరాల నమోదును ఎన్సీఆర్బీ విశ్లేషించింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది.
ప్రతి మిలియన్ జనాభాకు హైదరాబాద్ నగరంలో 2599 నేరాలు జరుగుతున్నాయి. ఇదే దేశ రాజధాని ఢిల్లీ ప్రతి మిలియన్ జనాభాకు 18,596 నేరాలతో మొదటి స్థానంలో నిలిచింది. కేవలం 1034 నేరాల నమోదుతో కలకత్తా అత్యంత తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా నిలిచింది. 2568 నేరాలతో పూణే మెట్రో ద్వితీయ స్థానంలో ఉంది. ఐటీ నగరమైన హైదరాబాద్ సురక్షిత నగరంగా కొనసాగుతూ ఉన్నది. సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
దక్షణాది మెట్రో నగరాల్లో అతితక్కువ నేరాలు జరిగే నగరంగా హైదరాబాద్ నిలిచింది. మరో ఐటీ నగరంగా పిలుచుకునే బెంగళూరులో ప్రతీ మిలియన్ జనాభాకు 4272 నేరాలు నమోదవుతూ సురక్షిత నగరాల్లో ఐదవ స్థానాన్ని పొందింది. ఇక, హత్యల విషయానికొస్తే, కలకత్తాలో45, హైదరాబాద్లో 98, బెంగళూరులో 152, ఢిల్లీలో 454, ముంబాయిలో 162 జరిగాయి. హత్యాయత్నం కేసుల విషయానికొస్తే కలకత్తా 135, హైదరాబాద్లో 192, బెంగళూరులో 371, ఢిల్లీలో 752, ముంబాయిలో 349గా నమోదయ్యాయి. లైంగికదాడి కేసుల్లో కలకత్తాలో 11, హైదరాబాద్లో 116 , బెంగుళూరులో 117, ఢిల్లీలో 1226, ముంబయిలో 364 నమోదయ్యాయి. మహిళలపై దాడుల్లో 127 కలకత్తా, 177 హైదరాబాద్, 357 బెంగుళూరు, 1023 ఢిల్లీలో జరిగాయి.