Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి టీఎస్జీహెచ్ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను మంగళవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరాంకుశం రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజ గంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను బోధనేతర పనుల్లో నియమించొద్దని కోరారు. ఆ పనులకు వారిని బాధ్యులను చేయొద్దంటూ విద్యాహక్కు చట్టం సెక్షన్ 27, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులలో స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అకారణంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అంశాలలో పలువురు ప్రధానోపాధ్యాయులను సస్పెన్షన్లకు గురిచేయడంతో విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వారిని మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బాధ్యతల నుంచి విముక్తులను చేస్తూ తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రధానోపాధ్యాయుల అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకటి కంటే అదనంగా ఎంఈవో ఎఫ్ఏసీలుగా ఉన్న ప్రధానోపాధ్యాయులకు ఆ అదనపు మండలాల భారాన్ని తొలగించాలని పేర్కొన్నారు. ఆ స్థానంలో గతంలో ఎంఈవోలుగా పనిచేసి ఇప్పుడు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న వారిని నియమించడం ద్వారా ఒక మండలానికి ఒక ఎంఈవో వచ్చేలాగా బాధ్యతలను అప్పగించాలని సూచించారు. నూతన రాష్ట్రానికి నూతన సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కోరారు. అన్ని అంశాలపై విద్యాశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ వాటిని పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.