Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సంఘాలకు మంత్రి ఎర్రబెల్లి
- ఎండుమిర్చి మార్కెటింగ్‌పై సెర్ప్, ప్లాంట్ లిపిడ్స్ మధ్య ఎంఓయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల నుంచి ఎస్‌హెచ్‌జీ గ్రూపులు సేకరించిన పంటలను నేరుగా కొనేందుకు కంపెనీలు తెలంగాణలోనే ముందుకొస్తున్నాయనీ, ఈ ఏడాది రూ.200 కోట్ల విలువైన మిర్చిపంట వ్యాపార లక్ష్యంతో ముందుకెళ్లాలని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. స్వయం సహాయక గ్రూపుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకుగానూ మంగళవారం హైదరాబాద్‌లో కేరళకు చెందిన ఈ-కామర్స్ సంస్థ ప్లాంట్ లిపిడ్స్ ప్రయివేటు లిమిటెడ్‌తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ నేచుపాదం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..తెలంగాణ మిర్చికి బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మహిళా సంఘాలు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి కంపెనీలతో వ్యాపారం చేయాలనీ, దానికి తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీనిచ్చారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ-కామర్స్ మార్కెటింగ్ సౌకర్యం విస్తరించాలని ఆకాంక్షించారు. సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్ర రైతు ఉత్పాదక సంఘాల ద్వారా వ్యాపారం నిర్వహించడంలో మన మహిళా సంఘాలు దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నాయనీ, ఈ విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్దును అందజేసిందని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో రూ.40 కోట్లతో ఎండు మిర్చి వ్యాపారం నిర్వహించి రూ.92 లక్షల లాభాలు గడించడం అభినందనీయమన్నారు. వచ్చే సీజన్లో ఆరు జిల్లాలలో 20 వేల మెట్రిక్ టన్నుల ఎండుమిర్చి సేకరించి పది కోట్ల లాభాలు ఆర్జించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జాన్నేచుపాదం మాట్లాడుతూ..కమ్యూనిటీ భాగస్వామ్యంతో మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివద్ధి సాధించాలన్నారు. తెలంగాణా, కర్నాటక తదితర ప్రాంతాలలో ఎండుమిర్చి వ్యాపార రంగంలో తమ సంస్థ ముందంజలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ముఖ్య ఆపరేషనల్ అధికారి రజిత, ప్లాంట్ లిపిడ్స్ సంస్థ చీఫ్ ప్రోక్యూర్మెంట్ అధికారి థామస్ డానియల్, పలు విభాగాల డైరెక్టర్లు సునీత, సువిధ, పద్మ, ప్లాంట్ లిపిడ్స్ కంపెనీ ప్రతినిధులు, డీఆర్డీఓలు, అదనపు డీఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.