Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీఎస్సీ-2008 కామన్ మెరిట్లో ఎంపికై నష్టపోయిన బీఎడ్ అభ్యర్థుల కు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వ హించిన డీఎస్సీ-2008 నియామకాల్లో ప్రాతిపదిక నిబంధనల మార్పువల్ల సుమారు నాలుగు వేలకుపైగా బీఎడ్ అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పో వడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యారని తెలిపారు. కామన్ మెరిట్లో ఎంపికై నష్టపోయిన 1,200 మంది అభ్యర్థులు పన్నెండేండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారికి ఉద్యోగాలిస్తామంటూ 2016 వరంగల్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రకటనను ఆదర్శంగా తీసుకుని పక్కన ఏపీ ప్రభుత్వం, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులతో ఒక కమిటీ వేసి ఆ నివేదిక ఆధారంగా జీవోనెంబర్ 39ని విడుదల చేసిందని తెలిపారు. కనీస టైం స్కేల్ పద్ధతిలో 2021లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించారని వివరించారు. ఎనిమిది నెలలుగా వారు జీతాలు సైతం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ సీఎం ఇచ్చిన హామీ ఇక్కడ ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మెరిట్ మార్కులు సాధించిప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో వారు తీవ్రమైన నిరాశతో ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో స్వయంగా కేసీఆర్ జోక్యం చేసుకుని డీఎస్సీ-2008 కామన్ మెరిట్లో ఎంపికై నష్టపోయిన అభ్యర్థుల కు ఉద్యోగాలిచ్చి, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.