Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ఎస్పీడీకి టీఎస్‌యూటీఎఫ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్వో)లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీదేవసేన, ఏఎస్పీడీ రమేష్‌కు మంగళవారం టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి లేఖ రాశారు. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయని తెలిపారు. వాటిలో కాంట్రాక్టు పద్ధతిలో ఎస్వోలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏ స్వల్ప ఘటన జరిగినా ఎస్వోను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. వారు నిర్దోషి అని తేలినా నెలల తరబడి పునర్నీయామకం చేయడం లేదని విమర్శించారు. మహిళలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు పరుషంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కేజీబీవీ ఎస్‌వోల సమస్యలు
1. కేజీబీవీల్లో చదివే విద్యార్థినిల మెస్‌చార్జీలను ప్రస్తుత ధరలకనుగుణంగా పెంచాలి.
2. ఇంటర్ విద్యార్థినిలకు అదనంగా పర్‌క్యాపిటా నిర్ణయించాలి.
3. విద్యార్థినిలకు కాస్మోటిక్ చార్జీలివ్వాలి.
4. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలూ (ట్రంక్ బాక్స్, నోట్‌బుక్స్ వంటివి) కల్పించాలి.
5. ఆర్థిక నిబంధనలు మార్చాలి. నిర్వహణ కోసం పెట్టే నిధులు రూ.50 వేలు మంజూరు చేయాలి. పాఠశాల అవసరాలపై ఎస్వోలు పంపిన ప్రతిపాదనలను జాప్యం లేకుండా ఇవ్వాలి.
6. గత ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలి. సరిపడినంత బడ్జెట్‌ను ముందే విడుదల చేయాలి.
7. పీడీఎస్ బియ్యాన్ని పాఠశాలకు చేర్చాలి.
8. ఎస్‌వోల డ్యూటీ సమయం ఉదయం 8.45 నుంచి రాత్రి 7.30 వరకు ఉన్నది. అదనంగా రెండురోజులు నైట్డూటీ భారంగా ఉన్నది. ఎస్‌వోలకు నైట్‌డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి.
9. ఎస్వో పేరును ప్రిన్సిపాల్‌గా మార్చాలి. ప్రిన్సిపాల్ కనీస మూలవేతనం ఇవ్వాలి.
10. మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ అదనపు బాధ్యతల నుంచి ఎస్‌వోలను తప్పించాలి.
11. కేజీబీవీ హాస్టల్ నిర్వహణ కోసం కేర్‌టేకర్‌ను నియమించాలి.
12. స్వల్ప సంఘటనలకే ఎస్‌వోల తొలగింపును మానుకోవాలి. సమగ్రమైన విచారణ అనంతరం ఎస్‌వోల బాధ్యతా వైఫల్యం రుజువైనప్పుడే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
13. ఎస్‌వోలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. స్వల్ప కారణాలతో విధుల నుంచి తొలగించిన వారిని సత్వరమే పునర్నీయామకం చేయాలి.
14. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎస్‌వోల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాకుండా ప్రోత్సహించేలా సూచనలుండాలి.
15. ఏఎన్ఎం లేదా సీఆర్టీలు ప్రసూతి సెలవులో ఉన్న సందర్భంలో మరొకరిని తాత్కాలిక నియామకం చేయాలి.
16. పాఠశాలకు తగిన వసతి కల్పించాలి. మోడల్ స్కూల్ హాస్టళ్ల మాదిరిగా విద్యార్థినిలకు వసతి, బోర్డింగ్ సౌకర్యం కల్పించాలి.