Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ విస్తృత సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీని నియమించాలంటూ టీపీసీసీ కోరింది. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్‌రోజ్ పంక్షన్ హాల్లో నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఇదే అంశంపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన పీసీసీ ప్రతినిధులు, ఏఐసీసీ ప్రతినిధులు, కార్యవర్గాన్ని ఏకగ్రీవం చేసే బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆ తీర్మానాన్ని బలపరిచారు. పార్టీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని విఛిన్నం చేసేందుకు వీలుగా బీజేపీ ప్రజల మధ్య విద్వేషాన్ని నింపుతున్నదని విమర్శించారు. ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో దేశం ఉందనీ, ఈ సమయంలో దేశాన్ని కాపాడేందుకు రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. అనంతరం ప్రదేశ్ రిటన్నింగ్ అధికారి, ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ మాట్లాడుతూ డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియ తెలంగాణలో విజయవంతంగా పూర్తయిందన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియలో రాష్ట్ర కాంగ్రెస్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, గీతారెడ్డి, పొడెం వీరయ్య, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్, కార్యక్రమాల చైర్మెన్ మహేశ్వర్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహ, వి హనుమంతరావు, బాలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి, వీహెచ్ ఆలింగనం
గత కొంత కాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆలింగనం చేసుకున్నారు. అపాయ్యంగా మాట్లాడుకున్నారు. పీసీసీ సమావేశానంతరం...కారులో పోతున్న వీ హెచ్‌ను చూసి కారు దిగి వచ్చిన రేవంత్ ఆలింగనం చేసుకున్నారు. వీహెచ్ ఈ సందర్భంగా ఆయన్ను ఎలాంటి వివాదాలు లేకుండా సమావేశాన్ని నిర్వహించారని రేవంత్‌ను అభినందించారు. కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత రేవంత్ తన కారులోనే వీహెచ్ గాంధీభవన్‌కు వెళ్లారు.