Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత జాతీయోద్యమంతోపాటు.. హైదరాబాద్ సంస్థానంలో కొనసాగిన నిజాం వ్యతిరేక పోరాటంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన పాత్ర తెలంగాణ చరిత్రకే వన్నె తెచ్చిందని పలువురు వక్తలు తెలిపారు. సబ్బండ వర్గాల సాధికారతే ఆయనకు నిజమైన నివాళని వారు వ్యాఖ్యానించారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యాన బుధవారం హైదరాబాద్లోని జలదృశ్యంలో బాపూజీ పదో వర్థంతిని నిర్వహించారు. ఆ సమితి కన్వీనర్ దాసు సురేశ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా గత ఎనిమిదేండ్లుగా బాపూజీ విగ్రహాన్ని ట్యాంకు బండ్పై నెలకొల్పకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్థూపానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక స్థూపంగా వెంటనే నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాపూజీ పేరును భారతరత్నకు సిఫారసు చేయాలనికోరారు.
ప్రజల పట్ల నిబద్దత, కార్యదక్షత, నిజాయితీ, హుందాగా వ్యవహరించడం లాంటి బాపూజీ విధానాలు, లక్షణాలు నేటి యువతకు ఆదర్శప్రా యమని నివాళులర్పించారు. బాపూజీ సహచరుడు జేబీ రాజు మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్త్తం చేయడంలో ఆయన పోషించిన పాత్ర క్రియాశీలకమైందని తెలిపారు. కార్యక్రమంలో బాపూజీ మిత్రుడు ఏఎల్ మల్లయ్య, విమలక్క తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.