Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో ఔషధాలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 12 ప్రభుత్వాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో స్టోర్కు రూ. 3.60 కోట్ల చొప్పున మొత్తం రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ స్టోర్లను సిద్ధిపేట, సూర్యాపేట బోధనాస్పత్రులు, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, భుననగిరి, గద్వాల జిల్లా ఆస్పత్రులు, వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ కోసం 12 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను, 36 మంది ప్యాకర్లను, 12 మంది వాచ్ మెన్లను పొరుగు సేవల ప్రాతిపదికన నియమించుకునేందుకు అనుమతించారు. అంతే కాకుండా ఒక్కో స్టోర్ వద్ద ఒక్కో రవాణా వాహనం చొప్పున ఆర్టీసీ లేదా పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి 12 వాహనాలను అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు.
మానసిక చికిత్సాలయానికి పరికరాలు....
హైదరాబాద్ ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో పరికరాల సేకరణకు వీలుగా రూ.2.98 కోట్లకు పరిపాలనాపరమైన అనుమతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.