Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో డీజీపీ వెల్లడి
- పోలీసు బాస్ ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత భార్య
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులను అడుగు పెట్టనియ్యబోమని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మావోయిస్టు అగ్రనేత ఎడిమ అలియాస్ రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య ఎడిమ సావిత్రి డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు కార్యకలాపాలు సాగించేందుకు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులూ దోహదపడవని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి హింసా విధానాలను పక్కనబెట్టి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. సావిత్రి లాంటి అనేక మంది నాయకులు ప్రభుత్వానికి లొంగిపోవటానికి సిద్దంగా ఉన్నారనీ, కానీ కొందరు వారిని వెలుపలికి రానీయకుండా అడ్డుకుంటున్నారనే సమాచారము తమకున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, జన జీవన స్రవంతిలో కలిసి ప్రజల మెప్పుతో అధికారంలోకి వచ్చే రాచబాట ఉన్నదనీ, మావోయిస్టులు గుర్తించాలని ఆయన అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి భార్య సుజాతతో పాటు మరికొందరు నాయకుల భార్యలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, వారు వెంటనే జనజీవన స్రవంతిలో కలిసి తగిన చికిత్సను పొందాలని డీజీపీ పిలుపునిచ్చారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న సైతం తగిన చికిత్స అందక 2019లో గుండెపోటుతో మరణించారనీ, ఆ విధంగానే మరికొందరు నాయకులు కూడా కరోనా బారిన పడి అకాల మృత్యుపాలయ్యారని గుర్తు చేశారు.