Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు యూఎస్పీసీ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ లేఖ రాసింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయుల మధ్య సర్వీస్ రూల్స్ వివాదం కారణంగా రాష్ట్ర విద్యాశాఖలో పదిహేడేండ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాల్లేవని తెలిపింది. ఏడేండ్లుగా స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పదోన్నతులు, నాలుగేండ్లుగా బదిలీల్లేవని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల పోస్టులకు అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ)లతో విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1970 హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. 7,250 స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు, 2,100 ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఇంకా 10,478 పండిట్, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారని గుర్తు చేసింది. ఇవన్నీ ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారానే భర్తీ చేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు-2018 ప్రకారం ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ లోకల్ క్యాడర్‌గా వర్గీకరించారని తెలిపింది. దీంతో సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైందని భావిస్తున్నట్టు ప్రకటించింది. విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలంటూ అధికారులను ఆదేశిస్తూ మార్చి 10న అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేసింది. యూఎస్పీసీ పక్షాన సీఎంతోపాటు విద్యాశాఖ అధికారులకు పలుసార్లు చేశామని పేర్కొంది. ఆందోళనలు నిర్వహించినా ఇప్పటికీ విద్యాశాఖ అందుకు తగిన విధంగా షెడ్యూల్ విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీలు, పదోన్నతుల్లేక ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నదని తెలిపింది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొంది. తక్షణమే పదోన్నతులకు అనుమతిస్తే పది నుంచి ఇరవై వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులొస్తాయని వివరించింది. 50 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతాయని తెలిపింది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని అభిప్రాయపడింది. సీఎం జోక్యం చేసుకుని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వివాదం లేని కేటగిరీలలో పదోన్నతులు నిర్వహించటానికి సంబంధిత అధికారులకు అనుమతి ఇవ్వాలని కోరారు.