Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ... అన్ని ఏర్పాట్లూ పూర్తి : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ ప్రభుత్వం ప్రతి యేటా ఇచ్చే బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తున్నామని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ప్రభుత్వం ఉద్దేశం నెరవేరుతున్నదని ఆయన బుధవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తామని వివరించారు. ఇందుకోసం తమ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లను సమన్వయం చేసిందని వివరించారు. ఈ యేడాది కోటి బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నామనీ, గతం కన్నా ఎక్కువ డిజైన్లు, రంగులు, వైరైటీల్లో వాటిని తయారు చేశామని తెలిపారు. గ్రామల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, వారి ఆసక్తుల మేరకు నిఫ్ట్ డిజైనర్ల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో వాటిని ఉత్పత్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. 24 విభిన్న డిజైన్లలో పది రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల)తో నూటికి నూరు శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను రూపొందించామని ఆయన తెలిపారు. వాటి తయారీ కోసం ప్రభుత్వం మొత్తం రూ.339.73 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఈ క్రమంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన 2017 నుంచి ఇప్పటిదాకా మొత్తం 5.81 కోట్ల చీరెలను మహిళలకు అందించామని కేటీఆర్ వెల్లడించారు.