Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సాధికారతతోనే సమాజం ముందుకు..
- మార్పు ఇంటినుంచే మొదలవ్వాలి
- 'లింగసమానత్వం- సాధికారత' సదస్సులో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలపై హింస లేని సమాజంకోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా సాధికారతతోనే సమాజం ముందుకు పోతుందని చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరిస్తే అభివృద్ధి సాధించడం సాధ్యం కానే కాదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని వివరించారు. భూమిక ఉమెన్స్ కలెక్టివ్, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'లింగ సమానత్వం- మహిళా సాధికారత' అనే అంశంపై బుధవారం సికింద్రాబాద్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆడపిల్ల, మగపిల్లవాడనే తేడా వివక్ష లేకుండా వారిని చదివిద్దాం.. తద్వారా ఇంటికి సమాజానికి వెలుగులను పంచుదామని సూచించారు. మార్పు ఇంటినుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టిందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన భోజన వసతి, విద్య కల్పిస్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా విదేశీ చదువులకు రూ.20 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తున్నదనీ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక సాయం చేస్తున్నదని చెప్పారు. స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావటం మనందరికీ గర్వకారణమన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
కమలాదేవి..మల్లు స్వరాజ్యం స్ఫూర్తి..
మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఆరుట్ల కమలాదేవి, మల్లుస్వరాజ్యం జీవితం మహిళలకు గొప్ప స్పూర్తి కావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ..ఎస్ఆర్ శంకరన్, కన్నాభిరాన్, బాలగోపాల్ కృషి మరవలేనిదని చెప్పారు. మహిళలు పడుతున్న ఇబ్బందులు సున్నితంగానూ, చెప్పలేనివిగా ఉంటాయనీ, వాటిని ప్రగతిశీలంగా అర్థం చేసుకుని పరిష్కారం చూపించటం గొప్ప విశేషమన్నారు. చిన్నపిల్లల భద్రత, వారి అభివృద్ధికి తగిన విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. భూమిక ఉమెన్స్ కలెక్టీవ్ ఛీప్ కె సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ బాధ్యులు పి.దామోదర్, కవిరాజు, మానటరింగ్ అధికారి విజరుకన్నా, మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.