Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వ్యతిరేక శక్తుల మధ్య ఐక్యతకు కృషి
- 16న 'సేవ్ నేషన్' సెమినార్‌కు నలుగురు సీఎంలకు ఆహ్వానం : కె నారాయణ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చేనెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో సీపీఐ జాతీయ 24వ మహాసభలు జరుగుతాయని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు, శక్తుల మధ్య జాతీయ స్థాయిలో ఐక్యతకు కృషి చేస్తామనీ, ఆ దిశగా ఈ మహాసభలు దోహదపడతాయని అన్నారు. వచ్చేనెల 16న 'సేవ్ నేషన్' పేరుతో నిర్వహించే జాతీయ సెమినార్‌కు కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, స్టాలిన్, కె చంద్రశేఖర్‌రావు, నితీశ్ కుమార్‌ను ఆహ్వానిస్తున్నామని వివరించారు. సీపీఐ రాష్ట్ర మహాసభ తర్వాత నూతనంగా ఎన్నికైన రాష్ట్ర సమితి సమావేశాన్ని హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో బుధవారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్నుద్దేశించి నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఫ్యాక్షనిస్టుల మాదిరిగా తయారు చేశారని విమర్శించారు. కులం, మతం పేరుతో ప్రజలను విభజించిన ఆ పార్టీ ఇప్పుడు ప్రత్యర్థులను, వ్యతిరేక పార్టీలను ఫ్యాక్షనిస్టుల మాదిరిగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలతో వెంటాడుతూ బెదిరిస్తున్నాయని అన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకూ విరుద్ధమని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి స్వయం కృతాపరాథంతోనే తెలుగు రాష్ట్రాల్లో ఆయా శక్తులు బలపడేందుకు అవకాశం దొరికిందన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమించకుండా వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను ఇద్దరు సీఎంలు సంకుచిత ధోరణితో అణిచివేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ ప్రమాదాన్ని గుర్తించి, బీజేపీకి వ్యతిరేకంగా అందరం కలిసి గట్టిగా పోరాడాల్సిన అవసరముందని సూచించారు.
మహాసభకు 20 దేశాల ప్రతినిధులు : చాడ
సీపీఐ జాతీయ మహాసభకు 20 దేశాల నుండి సౌహార్థ ప్రతినిధులు హాజరవుతారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. జాతీయ మహాసభ ప్రారంభ సూచికగా విజయవాడలో వచ్చేనెల 14న బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నియంతృత్వ, మతోన్మాద, ఫాసిస్టు బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర, వామపక్షాల విస్తృత వేదిక ఏర్పాటుకు ఈ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంపై కార్యాచరణ రూపకల్పనతో పాటు మార్పులపైనా చర్చిస్తామని అన్నారు.
ఉద్యమాలపై రాజీలేదు : కూనంనేని
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై ఉద్యమించటంలో ఎలాంటి రాజీలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో మతతత్వ బీజేపీని నిలువరించేందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతునిచ్చామని అన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. వీఆర్ఏలు, డీఎస్సీ-98, ఆర్టీసీ వంటి అనేక సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, పేదలకు ఇండ్ల స్థలాల కోసం పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు కె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.