Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీలో త్వరలో అమల్లోకి
- నష్టాలు తగ్గించుకొనేందుకు మార్గాన్వేషణ
- 'కారుణ్యం'లో పనిచేయకుంటే ఇంటికే...
- సెస్‌లు పెంచినా జనం తిరగబడలేదు: చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీజన్‌ను బట్టి టిక్కెట్ రేట్లను నిర్ణయించే ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నదనీ, త్వరలో దాన్ని అమల్లోకి తెస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ప్రయివేటు ఆపరేటర్ల మాదిరి ఇష్టం వచ్చినట్టు టిక్కెట్లు పెంచుకొనే పరిస్థితి తమకు లేదనీ, అందువల్లే నష్టాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. డీజిల్, ఆయిల్ సెస్‌లు, బస్పాసుల రేట్లు పెంచితే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదనీ, ఆర్టీసీ స్థితిగతులను ఆర్థం చేసుకొని, వారు ఆదరిస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. టీఎస్ఆర్టీసీ చైర్మెన్‌గా నియమితులై ఏడాది పూర్తయిన సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, డైరెక్టర్లతో కలిసి బుధవారంనాడిక్కడి బస్‌భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంకంటే ఇప్పుడు సంస్థ ఆదాయం బాగా పెరిగిందన్నారు. సంస్థకు రూ.1,036 కోట్లుగా ఉన్న నష్టాన్ని రూ.395 కోట్లకు తగ్గించామనీ, రూ.641 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకోగలిగామని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావల్సిన రీయింబర్స్మెంట్ బకాయిల సొమ్ము క్రమం తప్పకుండా వస్తున్నదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కారుణ్య నియామకాలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వడంపై అడిగిన మరో ప్రశ్నపై స్పందిస్తూ, ''అలాంటిదేం లేదు. ఈ విషయంలో ఎవరికీ అభద్రతాభావం అవసరం లేదు. రెండేండ్లు వారికి శిక్షణాకాలం. సరిగా పనిచేయకపోతే ఇంటికి పంపేస్తాం. ఇందులో ఎలాంటి మొహమాటం లేదని తేల్చిచెప్పారు. కారుణ్య నియమకాలకోసం 1,200 మంది ఉన్నారనీ, వారిలో తొలి విడతగా 168 మందిని తీసుకున్నామని తెలిపారు. మిగిలిన వారిని దశలవారీగా తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా అదే వేదికపై నుంచి ఐదుగురు కారుణ్య నియామక అభ్యర్థులకు లాంఛనంగా శిక్షణా పత్రాలు అందచేశారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కింద దాదాపు 600 మంది రిటైర్ అయ్యారని తెలిపారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 70 శాతానికి పెరిగిందన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చామని చెప్పారు. లాజిస్టిక్ సర్వీస్ ద్వారా నెలకు రూ.100 కోట్లు అదనంగా ఆదాయం వస్తున్నదని వివరిం చారు. కరోనాకు ముందు రోజువారీ ఆదాయం రూ.11 కోట్లు కాగా, సెస్‌ల పెంపు, ఇతర కారణా లతో ఇప్పుడు రోజుకు రూ.15 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు ఆదాయం వస్తున్నదని తెలిపారు. ప్రయాణీకుల సురక్షిణ ప్రయాణం కోసం పాడైన బస్సుల్ని మూలకు పెట్టామనీ, కొత్తగా వెయ్యి బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించామనీ, వాటిలో తొలివిడతగా 300 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వస్తాయని చెప్పారు. అద్దె బస్సుల సంఖ్య పెంచుతున్నామనే ప్రచారం వాస్తవం కాదన్నారు. 65 శాతం ప్రభుత్వ బస్సులే ఉంటాయని స్పష్టం చేశారు. అద్దెబస్సులు తాత్కాలికంగా పెరిగినట్టు కనిపించినా, సంస్థకు కొత్తబస్సులు వస్తే, రేషియో ప్రకారమే బస్సుల సంఖ్య ఉంటుందన్నారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తే, సంస్థకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రప్రభుత్వం చేసిన ప్రతిపాదనను విలేకరులు చైర్మన్ వద్ద ప్రస్తావించారు. టీఎస్ఆర్టీసీకి 1,400 ఎకరాల భూమి, వేలకోట్ల ఆస్తులు ఉన్నా యనీ, ఆర్టీసీ అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ఆర్టీసీలో కేంద్రంవాటా ఉన్నా, వారి మాటల్ని వినాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. బస్ భవన్ ఉద్యోగులు చైర్మెన్, ఎమ్డీలకు అభినందనలు తెలిపారు.