Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కడ ధర అధికంగా ఉన్నందునే..
- ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రైతులు
- టీఎస్ ఆయిల్‌ఫెడ్‌పై నష్టాల భారం
- విచ్చలవిడిగా ఎఫ్-కోడ్ల జారీ
- జియో ట్యాగింగ్‌తో సమస్య పరిష్కారం
నవతెలంగాణ-దమ్మపేట
ఏపీ నుంచి భారీగా వస్తున్న పామాయిల్ గెలలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు ఆంధ్రా నుంచి పామాయిల్ గెలలు ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి వస్తుండటంతో ఇక్కడి రైతుల ట్రాక్టర్లు అన్లోడ్ అవడానికి రెండు నుంచి మూడు రోజుల వ్యవధి పడుతోంది.ఈ పరిస్థితి ప్రతేడాది సీజన్లోను, క్రూడ్ పామాయిల్ ధర పతనం అవుతున్నప్పుడు ఎదురవుతోంది. ఆంధ్రాలోని రైతులకు అక్కడి ఫ్యాక్టరీలు చెల్లించే గెలల ధర కంటే తెలంగాణాలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ చెల్లించే ధర అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆయిల్‌పామ్ యాక్టు ప్రకారం ఆయా ఫ్యాక్టరీల పరిధిలో పండే పామాయిల్ గెలలను మాత్రమే ఆయా కంపెనీలు కొనుగోలు చేయాలి. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీఎస్ ఆయిల్‌ఫెడ్ ఆంధ్రాలో పండిన పామాయిల్ గెలలను దొడ్డిదారిన కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలున్నాయి. దాంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు కూడా నష్టం జరుగుతోంది.
విచ్చలవిడిగా ఎఫ్-కోడ్లు..
రైతుల నుంచి పామాయిల్ గెలల కొనుగోలుకు టీఎస్ ఆయిల్‌ఫెడ్ ప్రతి పామాయిల్ రైతు ఖాతాకు ఎఫ్-కోడ్‌ను కేటాయిం చింది. రైతులు జమ చేసే పామా యిల్ గెలలు ఈ ఎఫ్-కోడ్ ఖాతాలో జమవుతాయి. ఎఫ్- కోడ్ల కేటా యింపు పూర్తిగా లోప భూయిష్టంగా జరిగిందని రైతులు గగ్గోలు పెడుతున్నా ఆయిల్‌ఫెడ్ యాజ మాన్యం వినిపించుకోవడం లేదు. ఆయిల్‌ఫెడ్ జారీ చేసిన ఎఫ్- కోడ్లు రైతులు, కౌలు రైతులకు పరిమితి లేకుండా కేటాయించారు. వీటికి ఎటువంటి కాల పరిమితి, పరిమాణ పరిమితులు లేవు.
జియో ట్యాగింగ్‌తో సమస్య పరిష్కారం..
సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి యాజమాన్యానికి ఉంటే జియో ట్యాగింగ్‌తో సమస్యను పరిష్కరించవచ్చని రైతులు సూచిస్తున్నారు. ఉద్యానవన శాఖ వద్ద పామాయిల్ రైతుల పేర్లు, విస్తీర్ణంతో కూడిన జాబితా గ్రామాల వారీగా ఉంది. వీటి ఆధారంగా ఫ్యాక్టరీకి పామాయిల్ తోటలను జియో ట్యాగింగ్ చేసి కొత్త ఖాతాలతో ఎఫ్-కోడ్లను జారీ చేయాలి. రైతు ఖాతాకు పంట విస్తీర్ణానికి లోబడి గెలల సగటు దిగుబడిని నిర్ణయించి సదరు పరిమాణంతో సాఫ్ట్‌వేర్‌లో కొత్త ఎఫ్-కోడ్‌ను అనుసందానించాలి. సొంత తోటవున్న రైతు కౌలుకి ఇచ్చినట్లయితే సదురు కోడ్‌ను సస్పెన్ష్న్లో ఉంచి కాలపరిమితితో కూడిన సబ్ కోడ్‌ను కేటాయించాలి. ఈ సాంకేతికతను అమలు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
టీఎస్ ఆయిల్‌ఫెడ్‌పై నష్టాల భారం..
క్రూడ్ పామాయిల్ ధర పతనం అవుతున్న తరుణంలో ఆంధ్రా నుంచి గెలలు పోటెత్తుతుండడంతో టీఎస్ ఆయిల్‌ఫెడ్‌పై సైతం నష్టాల భారం పడుతోంది. క్రూడ్ పామాయిల్ ధర పెరుగుతున్న సందర్భాల్లో ఆంధ్రా రైతులు తమ గెలలను ఆయా కంపెనీలకే విక్రయించుకుంటున్నారు. ధర పెరిగే సందర్బాల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ కంటే ఎక్కువ ధరను ఆయా కంపెనీలు చెల్లిస్తుండటమే దీనికి కారణం. క్రూడ్ పామాయిల్ అమ్మకం ధర ప్రాతిపదికన రైతులకు పామాయిల్ పండ్ల గెలల ధరను నిర్ణయించి చెల్లిస్తారు. ఈ ధర నిత్యం మార్పు చెందుతుంటుంది. తెలంగాణాలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ నెల రోజులపాటు క్రూడ్ పామాయిల్ అమ్మిన ధరను సగటున ఆధారంగా మరుసటి నెల పామాయిల్ గెలల ధర నిర్ణయం చేస్తుంది. దీనికి భిన్నంగా ఆంధ్రాలో తాజా ధర ప్రాతిపదికనే గెలల ధరను నిర్ణయించి రైతాంగానికి చెల్లిస్తున్నారు. క్రూడ్ పామాయిల్ ధర పతనం అవుతున్న సందర్భాల్లో ఆంధ్రా కంటే తెలంగాణలో ధర అధికంగా ఉండటంతో తమ పంటను రైతులు తెలంగాణాకు తీసుకొస్తున్నారు.
ఆంధ్రా నుంచి గెలలు కొంటే మీకేంటి..
ఆంధ్రా నుంచి గెలలు కొంటే మీకేంటని ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం తమపై ఎదురుదాడి చేస్తోందని రైతులు వాపోతున్నారు. అక్కడి గెలలు కొనడం వల్ల వస్తున్న లాభాలు అవసరమా అని బహిరంగంగానే అంటున్నారు. సమస్య ఉత్పన్నమయ్యేది సీజన్లో కొద్ది రోజులు మాత్రమే అంటూ వాగ్వివాదానికి దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.
ఆంధ్రా గెలలు నివారించాలి:
పెద్ద రైతులు కొంత మంది తమ కార్డులను ఆంధ్రా రైతులకు ఇచ్చి విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. ఆయిల్‌ఫెడ్ ఇప్పటికే సుమారు ఐదు వందల కార్డులు రద్దు చేసింది. ఆంధ్రా గెలలను నిలువరించడానికి అందరూ సహకరించాలి.
టీఎస్ ఆయిల్‌ఫెడ్
జనరల్ మేనేజర్
సుధాకర్ రెడ్డి