Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై గొంతెత్తిన పేదలు
- ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో..
- కలెక్టరేట్లను ముట్టడించిన పేదలు
- భారీ ప్రదర్శలు, రోడ్డుపై బైటాయించి ధర్నాలు
- ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆక్రమిస్తాం
- పరిష్కరిస్తామన్న అధికారులు
పేదలకు నిలువు నీడ కరువైంది. భారమవుతున్న నిత్యావసరాలకు తోడు.. ఇంటిఅద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.రాష్ట్రంలోని పలు జిల్లాలో ్ల ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో తొలిరోజైన బుధవారం కలెక్టరేట్లను ముట్టడించారు. తాము పడుతున్న గూడు గోస వినాలని మొరపెట్టుకున్నారు. నవతెలంగాణ-విలేకరులు
సమస్యలపైపేదలు గొంతెత్తి నినదించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలు నినదించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే అక్రమించుకుంటామని హెచ్చరించారు. 'డబుల్' ఇండ్లను అర్హులైన వారికి పంచాలని, ఇల్లు లేని పేదలకు 120 గజాల స్థలం కేటాయించి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలంటున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతున్నారు. ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ ప్రదర్శనగా కలెక్టరేట్ల వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గొంతెత్తి నినదించారు. మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ తదితర చోట్ల ఆందోళనలు జరిగాయి. పేదలు భారీ ఎత్తున కదలివచ్చారు. మహబూబాబాద్‌లో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, రోడ్లుపై మూడు గంటలపాటు భైటాయించి ధర్నా చేశారు. దాంతో పోలీసులు, ఆందోళన కారులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మహబూబాబాద్‌లో.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేరుమాళ్ళ జగన్నాధం భవన్ నుంచి పేదలు భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వెళుతుండగా పోలీసులు అడ్డగించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాకు అనుమతి లేదని, ఒక ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపుతామని ఎస్ఐ రవికుమార్ చెప్పడంతో.. కలెక్టర్‌ను కలవకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, కలెక్టరే ఇక్కడి వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వాలని ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని సమయం ఇవ్వాలని ఎస్ఐ కోరడంతో ప్రజాసంఘాల కార్యకర్తలు మూడుకోట్ల సెంటర్లో బైటాయించి రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జి. నాగయ్య మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల కోసం ఇంకెంతకాలం వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేసిన సామాజిక సర్వే ఆధారంగా ఇల్లు లేని పేదల సంఖ్య ప్రభుత్వం దగ్గర ఉందని, ఆ ప్రకారం జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించి పేదలకు ఇంటి స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 5564 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరైతే వాటిలో కేవలం 1480 ఇండ్లు పూర్తి చేయగా, 789 ఇండ్లు మాత్రమే పేదలకు పంచారన్నారు. వాటిలో కూడా అనేక రకాల పైరవీల పేరుతో పేదల నుంచి డబ్బులు తీసుకుంటున్నారన్నారు. పోడు రైతుల పట్టాల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఉండొద్దని, ఎఫ్ఆర్సీ కమిటీల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు కలెక్టర్‌ని కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్థితి జిల్లాల్లో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ పేదల సమస్యలు విని, ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. సుమారు మూడు గంటల పాటు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. చివరకు కలెక్టర్ ప్రతినిధిగా మహబూబాబాద్ తహసీల్దార్ నాగ భవాని ఆందోళన స్థలానికి వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సాదుల శ్రీనివాస్, ఆకుల రాజు, శెట్టి వెంకన్న, సూర్నపు సోమయ్య, అల్వాల వీరయ్య, గాడి పల్లి ప్రమీల, అంగోత్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాదిమంది పేద ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దారిపొడుగునా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. ఇంటి స్థలం లేక, ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం స్థలం లేనివారికి ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తామని హెచ్చరించారు. జిల్లాలో అనేక మండలాలతో పాటు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేవారు. అనంతరం నేతలు జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే విచారణ జరిపి పేదలందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజె. రమేష్, నాయకులు అన్నవరపు సత్యనారాయణ, ఎం.జ్యోతి, కారం పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో.. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పట్నం సంఘం రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లోని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఇండ్లు కేటాయించకపోవడంతో అనేక మంది పేదలు నిరాశ నిస్పృహలతో ఎదురుచూస్తున్నారని, వెంటనే కేటాయించాలని తెలిపారు. ఈ సేవ, కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల గుర్తింపు సర్వే వెంటనే పూర్తి చేసి బస్తీల్లో పట్టాలేని ఇండ్లకు జీవో 58 కింద వెంటనే పట్టాలు జారీ చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లుకి కలిసి వినతి పత్రం అందజేయగా.. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ధర్నాలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, ఐద్వా రాష్ట్ర నాయకురాలు ఆశాలత, సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, ఐద్వా నగర కార్యదర్శి కె. నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రిభువనగిరిలో.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో.. డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి, అక్కడక్కడ కొన్ని నిర్మాణాలు చేసి కొన్ని ప్రాంతాల్లో పంచి చేతులు దులుపు కుందని విమర్శించారు. ఈ ధర్నాలో ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్లలో వినతిపత్రం అందజేశారు.