Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్సిడీపై చేతులెత్తిన కేంద్రం
రైతుల పోరాట ఫలితంగా వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న మోడీ ప్రభుత్వం వివిధ రూపాల్లో అన్నదాతలను అధోగతి పాలుచేస్తోంది. ఈ చర్యల్లో భాగంగా ఎరువుల ధరల భారం మోపేందుకు రకరకాల జిమ్మి క్కులకు పాల్పడుతోంది. పెట్టుబడి భారంతో రైతాంగాన్ని ఉద్దేశ పూర్వకంగా దివాళా తీయించి.. ఆ తర్వాత కార్పొరేట్ చేతుల్లో వ్యవసాయాన్ని పెట్టేందుకు కేంద్రం కుటిలయత్నాలకు పూను కుంటోందని రైతుసంఘాలు మండిపడుతున్నాయి.
- 2020 నుంచి క్రమేణా ధరల పెంపు
- కనిష్టంగా రూ.200 నుంచి గరిష్టంగా 900 వరకూ..
- ఎగిసిపడుతున్న ఎంవోపీ.. రూ.800 నుంచి 1700కు పెంపు
- ఆర్గానిక్ వైపంటూ రసాయన ఎరువులపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
2020 నుంచి క్రమేణా ఎరువుల ధరలు పెంచుతోంది. రైతులు ప్రధానంగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాపై కనీసంగా రూ.200 నుంచి 900 వరకూ ధర పెంచింది. గతేడాది వరకూ రూ.800 ఉన్న ఎంవోపీ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్) ధరను ఏకంగా రూ.1,700కు పెంచింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలనీ కూడా పెరిగాయి. ఆయిల్ తరహాలోనే ఎరువుల కంపెనీలపైనా నియంత్రణ కోల్పోయిన ప్రభుత్వం విచ్చలవిడిగా ధరలు పెంచుతున్నా తమ చేతుల్లో లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఒక యూరియా ధర నిర్ణయం మాత్రం తమ చేతుల్లో ఉంది కాబట్టి ముడిసరుకు ధర పెరిగినా ఆ భారం తాము భరిస్తున్నట్టు చెబుతోంది. యూరియా ధర రూ.270 నిలకడగా కొనసాగుతోంది.
ముడిసరుకు ధర పెరుగుదలతోనే...
ఎరువుల ధరల పెంపునకు ముడిసరుకు రేట్ల పెంపే కారణమని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఇటీవల ముగిసిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా కారణంగా చూపుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల తయారీకి అవసరమైన పాస్పారిక్, అమ్మోనియాను చైనా, అరేబియాతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ వీటి ధరలు భారీగా పెరిగాయని, పాస్పారిక్ యాసిడ్ ధర గతంలో 689 డాలర్లు ఉండగా ప్రస్తుతం 795 డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఈ వానాకాలం సీజన్ నుంచి అమల్లోకి వచ్చిన ఎరువుల ధరల పెంపు భారం ఇప్పుడిప్పుడే రైతులపై తీవ్రంగా పడుతుంటడంతో ప్రతిఘటన ఎదురవుతోంది. ఒక్కో రైతుపై రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెరిగిన ధరల భారం పడుతుందని నిపుణుల అంచనా. రాష్ట్రానికి ఖరీఫ్ సీజన్లో కేంద్రం 25 లక్షలకు పైగా ఎరువులను కేటాయించింది. దీనిలో డీఏపీ 2.50 లక్షల టన్నులకు పైగా ఉండగా ఎన్పీకే 10.50 లక్షల టన్నులకు పైగా ఉంది.
ఏ ఎరువు ధర ఎంత పెంపు...
గతేడాది కాలంగా ఒక్కో ఎరువు ధరలు ఒక్కో సమయంలో పెరుగుతున్నాయి. యూరియా ఒక్కటి నిలకడగా ఉండగా మిగిలిన ఎరువుల ధరలను పరిశీలిస్తే గతంలో రూ.1200 ఉన్న కట్ట (50 కేజీలు) డీఏపీ ఇప్పుడు రూ.1400 పలుకుతోంది. ఎస్ఎస్పీ (సూపర్ పాస్పేట్) రూ.300 నుంచి రూ.500, డీఏపీ రూ.1200 నుంచి రూ.1400, 14-35-14 రూ.1400 నుంచి మధ్యలో రూ.1900కు చేరింది. ఆ తర్వాత రూ.1700 చేశారు. 28-28-0 ధర పెంపు కూడా 14-35-14 తరహాలోనే పెరిగింది. ప్రస్తుతం రూ.1500 పలుకుతోంది. 10-26-0 ధర గతంలో రూ.1300 ఉండేది ఇప్పుడు రూ.1500కు చేరింది. 20-20-0-13 రూ.1200 నుంచి రూ.1400, మూడు 15లు, మూడు 16ల ధరలు కూడా రూ.200 మేరకు పెరిగాయి.
- మిర్చి నాట్లతో మరింతగా భారం
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. నెలరోజులుగా మిర్చి నాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే చాలా వరకు రైతులు నాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను కూడా అధికంగా రైతులు వేస్తారు. మిర్చితో పోల్చితే ఈ పంటలకు రసాయన ఎరువుల వినియోగం తక్కువైనప్పటికీ ఎకరానికి రెండు, మూడు కట్టలైనా వినియోగిస్తారు. మిర్చికి డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఎకరానికి పది కట్టల వరకూ చల్లుతారు. ఖమ్మం జిల్లాలో వివిధ ఎరువుల వినియోగాన్ని పరిశీలిస్తే... యూరియా 77,959.97 మెట్రిక్ టన్నులు, డీఏపీ 17005.95, ఎంవోపీ 7,450, కాంప్లెక్స్ ఎరువులు 76,648.89, ఎస్ఎస్పీ 7,369.425 మెట్రిక్ టన్నుల చొప్పున వినియోగిస్తున్నారు. దాదాపు ఎరువుల ధరలన్నీ పెరగడంతో రైతులపై మోయలేని భారం పడుతోంది.
ఎరువు భారమాయే...
ఏ ఎరువు ధర చూసినా మండిపడుతుంది. నేను రెండు ఎకరాల్లో మిరప తోట వేశా. పంట పూర్తయ్యే నాటికి ఎకరానికి 15 బస్తాల వరకూ వివిధ ఎరువులు వినియోగిం చాల్సి ఉంటుంది. ఎరువుల ధరలు ఈ రకంగా పెరిగితే ఏమి కొంటాం. ఒక్కో ఎరువు ధర రూ.200కు పైగా పెంచితే పంట చేతికి వచ్చేనాటికి ఎరువుల పెట్టుబడి భారం ఎకరానికి రూ.4000 వరకూ పడుతుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోగా ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్న దశలో రైతులపై కేంద్రం ఈ రకంగా భారం వేయడం సరికాదు.
- వనవాసం రాంరెడ్డి, గుండెపూడి, మహబూబాబాద్