Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో క్రికెట్ అభిమానులపై విరిగిన లాఠీ
- 3000 టికెట్లు ఇస్తున్నామన్న హెచ్‌సీఏ
- టికెట్ల కోసం 30 వేల మంది రాక
- తొక్కిసలాటలో మహిళకు తీవ్ర అస్వస్థత
- ఘటన దురదృష్టకరం : అజారుద్దీన్
- హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయొద్దు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-కంటోన్మెంట్
మూడు వేల టికెట్లకు.. 30 వేల మంది క్రికెట్ అభిమానులు తరలిరావడంతో జింఖానా గ్రౌండ్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్కసారిగా గేటును తోసుకుంటూ ముందుకెళ్లడంతో తోపులాట.. తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళను వెంటనే మహిళా పోలీసులు పక్కకు లాక్కొచ్చి నోటిద్వారా ఊది ప్రాణాపాయం నుంచి తప్పించారు.
అసలేం జరిగింది...?
3 వేల టికెట్లు ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. కానీ గురువారం జింఖానా గ్రౌండ్‌కు 30 వేలమంది దాకా టికెట్ల కొనుగోలుకు తరలివచ్చారు. ఈ క్రమంలో వర్షం రావడంతో అభిమానులు గేటును తీసుకొని టికెట్ కౌంటర్ల వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి నెలకొన్నది. చివరకు లాఠీచార్జి చేశారు. అస్వస్థతకు గురైన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
25న ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య టీ20 మ్యాచ్
25న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం గురువారం అభిమానులు భారీగా ఎగబడ్డారు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయిస్తున్నట్టు హెచ్‌సీఏ ప్రకటించడంతో బుధవారం రాత్రి నుంచే కొందరు జింఖానా గ్రౌండ్‌కు వచ్చారు గురువారం ఉదయం 8 గంటల నుంచి టికెట్ల కోసం లైన్లలో నిలబడ్డారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా పెద్దఎత్తున తరలివచ్చారు. టికెట్లు ఇచ్చేందుకు సిబ్బంది గేటు తెరవగానే ఒక్కసారిగా అభిమానులు తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నార్త్ జోన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ సంఖ్యలో గ్రౌండ్ వద్దకు చేరుకొన్నారు. గుంపులు గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అభిమానులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులను లెక్కచేయకుండా తోసుకుంటూ అభిమానులు గేట్ లోపలికి వెళ్లడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా.. భయంతో అందరూ పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరగటంతో.. 20 మంది స్పృహ తప్పి పడిపోయారు. పలువురు అభిమానులకు, పోలీసులకు గాయాలయ్యాయి. గ్రౌండ్లో పనిచేసే రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి, అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఐదు గంటల వరకు ఇవ్వాల్సిన టిక్కెట్లు మూడు గంటల వరకే అయిపోయాయి. అయితే, క్రికెట్లను కౌంటర్లలో అమ్మేదానికంటే బ్లాక్‌లో అముతున్నారని అభిమానులు ఆరోపించారు. పలువురు మహిళలు, అడ్డాకూలీల ద్వారా మధ్యవర్తులు బ్లాక్ టికెట్లు అమ్మించినట్టు ఆరోపణలొస్తున్నాయి. తొలుత అసోసియేషన్ వారు ఆధార్ కార్డు చూడకుండానే టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత గందరగోళం.. ఉద్రిక్తత నెలకొనడంతో ఆధార్‌కార్డు ఉన్నవారికి మాత్రమే రెండు టికెట్లు ఇచ్చారు. గ్రౌండ్లో ఉన్నవారిని మాత్రమే లోపల ఉంచి, గేటు బయట ఉన్న వారందరినీ పోలీసులు పంపించి వేశారు. నగర అడిషనల్ కమిషనర్ చౌహన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్పోర్ట్స్ పోలీస్ అధికారి రాధాకృష్ణ తదితరులు పరిస్థితిని పర్యవేక్షించారు.
క్రికెట్ నిర్వహణ అంత తేలికకాదు : అజారుద్దీన్
జింఖానాగ్రౌండ్ ఘటనపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పందించారు. ఘటనపై క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. భారత్- ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలో పలువురు గాయపడటం దురదృష్టకరమని అన్నారు. అయితే, మ్యాచ్ నిర్వహణ కూర్చొని మాట్లాడుకునేంత తేలికైన అంశం కాదనీ, ఘటన జరగకూడదనిదనీ, ఇందులో తమ తప్పు ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ నెంబర్‌వన్ రాష్ట్రం అని, మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్‌సీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నేడు తానున్నానని, రేపు మరొకరు ఉంటారనీ, అయితే అందరి ఆలోచనా ఒక్కటేనని, క్రికెట్ సవ్యంగా జరగాలనేది అందరికీ ఉంటుందని చెప్పారు. బాధితులకు హెచ్‌సీఏ అండగా ఉంటుందన్నారు.
హెచ్‌సీఏ నిర్లక్ష్యం వల్లే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జింఖానా గ్రౌండ్ ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, సీపీ మహేష్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు ఈ సమావేంలో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇది రెండో మ్యాచ్ అని, అదీగాక కరోనా తర్వాత జరిగే మ్యాచ్ కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నదని చెప్పారు. ఇబ్బందుల్లేకుండా మ్యాచ్ జరగాలన్నదే అందరి ఉద్దేశమని చెప్పారు. పెద్ద ఈవెంట్ కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ప్రభుత్వ సహకారం అందిస్తుందని, తగిన ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఈ ఘటన ఆధారంగా హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణకు పేరు తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. మ్యాచ్ బాగా జరిగితే మరిన్ని మ్యాచ్‌లు తెలంగాణకు వస్తాయన్నారు. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఇవ్వడంలోనూ తెలంగాణపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్ నిర్వహణలో పోలీసుల వైఫల్యం ఉందన్న వాదన సరైంది కాదని, ఇందులో వారి లోపమేమీ లేదని చెప్పారు. హెచ్‌సీఏ సమన్వయ లోపం వల్లే ఘటన జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా హెచ్‌సీఏ హామీ ఇచ్చిందన్నారు.